కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు రానున్నారు. అలాగే, కాకతీయ వైద్యకళాశాలకు కూడా నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (మెడికల్)ను ఎంపిక చేశారు. ఎంజీఎంకు అదనపు ఆర్‌ఎంఓలతోపాటు వైద్యుల కొరత లేకుండా చూస్తామని ఇటీవల డీఎంఈ డాక్టర్ వాణి ఇచ్చిన హామీ నెరవేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 31న కాంట్రాక్టు పద్ధతిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకం కోసం కేఎంసీలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, మరో నలుగురు ఆర్‌ఎంఓలను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో కేఎంసీ అనాటమీకి ఇద్దరు, ఎస్‌పీఎం (కమ్యూనిటీ మెడిసిన్)కు మరో ఇద్దరిని కేటాయించారు. దీంతో ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జాయిన్ కాగా మరొకరు సోమవారం జాయిన్ కానున్నారు. అలాగే, ఎంజీఎం నలుగురు అదనపు ఆర్‌ఎంఓలు కేటాయించగా ఇద్దరు జాయిన్ అయ్యారు. మరో ఇద్దరు సోమవారం విధుల్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఈనెల 2న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించారు. 16 పోస్టులకు 53 మంది హాజరయ్యారు. అభ్యర్థుల తాత్కాలిక జాబితా mgmwarangal.com వెబ్‌సైట్‌లో ప్రకటించినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రాంకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎంజీఎం హాస్పిటల్‌లో ఈనెల 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండలోని మల్లి కాంబ మనోవికాస కేంద్రానికి చెందిన మానసిక దివ్యాంగ చిన్నారులతో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. శనివారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని వారి నివాసంలో చిన్నారులు ఎంపీ, ఎమ్మెల్యేలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, స్వయంగా స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో సెమీకండక్టర్స్ ప్రయోగశాలతో పాటు టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ కోర్సు ఏర్పాటుకు నిట్ వరంగల్‌తో కంబోడియాకు చెందిన కిరిరోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ (కేఐటీహెచ్) శనివారం ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, కేఐటీహెచ్ చైర్మన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఒప్పందపత్రాలు పంచుకున్నారు. కేఐటీహెచ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రతినిధి పంకజ్‌చౌదరి, బోర్డు మెంబర్ పవన్‌రెడ్డి, నిట్ డిప్యూటీ డైరెక్టర్ రతీశ్‌కుమార్, ప్రొఫెసర్లు,డీన్లు శంకర్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
కాజీపేట అర్బన్: దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారతకు విశేష కృషిచేసిన ఉత్తమ వ్యక్తులు, సంస్థలకు రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ అధికారి విశ్వజ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అందజేసే పురస్కారాలకు ఈనెల 16 లోపు depwdsctgn. telangana.gov. inలో దరఖాస్తు చేయాలన్నారు.
వరంగల్ అర్బన్: దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ – 2026లో గ్రేటర్ వరంగల్ అడ్రస్ గల్లంతైంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అఽఽధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను శని వారం ప్రకటించారు. మూడు కేటగిరీల అవా ర్డుల్లో వరంగల్ చిరునామా ఆచూకీ లేదు. పది లక్షలకుపైన ఉన్న జనాభాలో గ్రేటర్ హైదరాబాద్ 27వ స్థానం దక్కించుకోగా, 10 లక్షల జనాభా కలిగిన వరంగల్ అర్హత లభించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.


