నకిలీ వైద్యులపై
మెడికల్ కౌన్సిల్ కొరడా
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమ ఔషధ వ్యాపారంపై టీజీ సేఫ్ (తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) డ్రగ్స్ విభాగం కొరడా ఝుళిపించింది. ఎలాంటి డ్రగ్ లైసెన్స్ లేకుండానే మందులను నిల్వచేసి విక్రయాలకు సిద్ధం చేసిన ఓ అక్రమ గోదాంపై అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.7.89 లక్షల విలువైన ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. యాంటీబయాటిక్స్, అల్సర్ నివారణ మందులు, దగ్గు మందులు, నొప్పి నివారణ ఔషధాలు, యాంటీహిస్టమైన్స్ సహా మొత్తం 22 రకాల మందులు అక్కడ నిల్వ చేసినట్లు గుర్తించారు.
శ్రీనివాసనగర్‌లో తనిఖీలు..
టీజీ సేఫ్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 6న హనుమకొండలోని బాలసముద్రం శ్రీనివాసనగర్‌లో తనిఖీలు చేపట్టారు. కాళోజీ కళాక్షేత్రం సమీపంలోని డోర్ నంబర్ 1–7–1741లో నిర్వహిస్తున్న గోదాంలో ఎలాంటి చెల్లుబాటయ్యే డ్రగ్ లైసెన్స్ లేకుండానే మందులను నిల్వ చేసినట్లు గుర్తించారు. బి.సృజన్‌రెడ్డి అనే వ్యక్తి తన ఉద్యోగి హరికృష్ణ ద్వారా ఈ గోదాంను నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని టీజీ సేఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది.
నమూనాల సేకరణ..
నిల్వ చేసిన మందుల్లో యాంటీబయాటిక్స్, అల్సర్ నివారణ ఔషధాలు, దగ్గు మందులు, నొప్పి నివారణ మందులు, యాంటీహిస్టమైన్స్ తదితరాలు ఉన్నాయి. మొత్తం రూ.7.89 లక్షల విలువైన ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి నాణ్యత, వివరాల నిర్ధారణ కోసం నమూనాలను సేకరించి విశ్లేషణకు పంపించారు. అనంతరం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
సరఫరాదారులకూ హెచ్చరికలు..
లైసెన్స్ లేని సంస్థలకు మందులను సరఫరా చేసే హోల్‌సేల్ వ్యాపారులు, డీలర్లపైనా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని టీజీ సేఫ్ హెచ్చరించింది. మందులను సరఫరా చేసే ముందు కొనుగోలుదారులకు చెల్లుబాటు అయ్యే డ్రగ్ లైసెన్స్ ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించింది. లైసెన్స్ లేకుండా ఔషధాలు నిల్వ చేయడం నేరమని, ఇందుకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
ముగ్గురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు..
హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు జె.కిరణ్‌కుమార్, వి.ఉపేందర్, పి.పావని దాడుల్లో పాల్గొన్నారు. వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో తనిఖీలు చేశారు.
ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్..
మందుల అక్రమ నిల్వలు, విక్రయాలు, అనుమానాస్పద తయారీ కార్యకలాపాలు, మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ కార్యకలాపాలపై ప్రజలు టీజీ సేఫ్ డ్రగ్స్ విభాగానికి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. ఇందుకోసం 1800–599–6969 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తారు.
ఖిలా వరంగల్: సరైన వైద్య అర్హతలు, రిజిస్ట్రేషన్ లేకుండానే అల్లోపతి వైద్యం చేస్తున్న వారిపై తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ (టీజీ ఎంసీ) కొరడా ఝుళిపించింది. ఉర్సు కరీమాబాద్‌లో నాలుగు అక్రమ వైద్య కేంద్రాలను గుర్తించి, వాటి నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సిల్ తనిఖీ బృందం ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈకేంద్రాలను గుర్తించింది. ఎస్.జయలక్ష్మి క్లినిక్, అన్విక్ష ఫార్మసితోపాటు రెండు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల నిర్వాహకులపై కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ దండెం లాలయ్యకుమార్ ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఈనెల 6న ఎఫ్‌ఐఆర్ నంబర్ 832/2026 నమోదు చేశారు. బీఎన్‌ఎస్ 318(4),319(2), తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టం–1968లోని 20(ఐఐ), 21, 22 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కౌన్సిల్ సభ్యులు శనివారం వెల్లడించారు. అర్హత, రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య చేయడం ప్రజల ప్రాణాలకు ముప్పని హెచ్చరించారు. డాక్టర్ల అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలని సూచించారు. నకిలీ వైద్యులు, అక్రమ వైద్య కేంద్రాల సమాచారం ఉంటే 9154382727 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని వారు కోరారు.
హనుమకొండలో టీజీ సేఫ్ దాడులు..
రూ.7.89 లక్షల విలువైన
మెడిసిన్స్ స్వాధీనం


