విస్తరణ సాధ్యమేనా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరానికి కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ రూ.1,465 కోట్ల నిధుల మంజూరుకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ద్వారా గ్రేటర్ వరంగల్ వరంగల్‌కు ముంపు నివారణ నుంచి శాశ్వత గట్టెక్కించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. కాగా, ఈ నిధులతో 95 కిలోమీటర్ల విస్తీర్ణంతో కూడిన వరద నీటి కాల్వల నిర్మాణం, కల్వర్టులు, నాలాల విస్తరణ చేపట్టనున్నారు. వర్షపు నీటి నాలాల వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తే సుమారు 200 కాలనీల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. నగర ప్రజల 25 ఏళ్లకు చిరకాల కోరిక తీరనుంది.
‘హైడ్రా’ తరహాలోనే సాధ్యం?
హైడ్రా తరహాలో ప్రభుత్వం వరంగల్‌కు కూడా ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్న ఏజెన్సీ అప్పగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. తద్వారా ఇక్క డి నాలా మూలాలు తేల్చడంతో పాటు ఆక్రమణలపై ఉక్కుపాదం, విస్తరణ, అభివృద్ధికి మార్గం లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పడు సువిశాలంగా ఉన్న నాలాలు కుచించుకుపోయాయి. రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, సర్వే ల్యాండ్ దస్త్రాలు మరోలా, ఇరిగేషన్ ఇంకొలా, ‘కుడా’, గ్రేటర్ వరంగల్ రికార్డులు మరోలా ఒకదానికొకటి పొంతన లేకపోవడం గమనార్హం. నాలాల స్థలాల్లో బల్దియా భవనాలకు పర్మిషన్లు మంజూరు చేసింది. నాలా స్థలాల్లో నిర్మాణాలు వెలుస్తున్నప్పటికీ చూసీ చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉన్న వరద నీటి నుంచి ఆయా నాలాలను విస్తరించాలంటే ప్రైవేట్ భూములు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కానీ, ఆ భూములను ఇచ్చేందుకు ఆ యాజమానులు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు. నగరంలో నాలాల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలకు ఏటా వర్షకాలంలో ప్రాణసంకటంగా మారుతోంది.
అధికారులు నడుం బిగించాలి..
నాలాల ఆక్రమణలు తొలగించేందుకు గతంలో పలుమార్లు కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీల నిర్ణయాలు నీరుగారిపోయా యి. నగరంలో నాలాల ఆక్రమణల తొలగింపునకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. నయీంనగర్, భద్రకాళి, హంటర్ రోడ్డు ప్రాంతాల్లోనే నాలాల సమీపంలో భవన నిర్మాణ అనుమతులు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారని ఆరా తీస్తే ఇరిగేషన్‌శాఖ ఇంజనీర్లు ఎన్‌ఓసీల ఆధారంగా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వక తప్పలేదని గ్రేటర్ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవ స్థలాలు నిర్ధారించాల్సిన శాఖలు మీదే బాధ్యత.. అంటే మీదే అంటూ తప్పించుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.
చిన్న వర్షమొచ్చినా ముంపే..
భారీ వర్షం తర్వాత కాలనీలు నీట మునగడం, ఆతర్వాత హడావిడి చేసి మర్చిపోవడం ఆయా శాఖల అధికారులకు సర్వ సాధారణమైందనన్న ఆరోపణలున్నాయి. వడ్డేపల్లి చెరువు మత్తడి నుంచి కేయూసీ వంద అడుగుల రోడ్డు, సమ్మయ్య నగర్, నయీంనగర్ బ్రిడ్జి వరకు నాలా విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు మూడేళ్లు పట్టింది. పోచమ్మకుంట నుంచి కాకతీయ కెనాల్ వరకు అడ్డంకులు ఉన్నాయి. భద్రకాళి చెరువు కాపువాడ మత్తడి నుంచి అలంకార్ పెద్ద మోరీ వరకు 120 అడుగుల వరకు నాలాను విస్తరించాలంటే 80 శాతం పట్టా భూములున్నాయి. వరంగల్ పోతన నగర్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, సరస్వతి కాలనీ, రంగంపేట, ములుగు రోడ్డు మీదుగా అలంకార్ వరకు 120 అడుగుల నాలా విస్తరణకు ఇక్కడ ఇవే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
నిధుల మంజూరు సరే.. ఆక్రమణల సంగతేంటి?
‘గ్రేటర్’లో నీరుగారిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ నిర్ణయాలు
‘హైడ్రా’ తరహాలోనే
సాధ్యమవుతుందనే అభిప్రాయాలు
ఐదు శాఖలు నడుం బిగిస్తేనే
ఆక్రమణల కట్టడి
రాజకీయ నాయకుల జోక్యం, పలుకుబడి కలిగిన వ్యక్తుల ఒత్తిళ్ల కారణంగా గ్రేటర్‌లో ఆక్రమణల తొలగింపు, నాలాల విస్తరణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా, ఖిలా వరంగల్ అగర్తలా నుంచి శివనగర్, సాకరాశికుంట, పెరుకవాడ, పన్నెండు మోరీలు, డీకే నగర్, బీఆర్ నగర్, దేశాయిపేట, డాక్టర్స్ కాలనీ, తుమ్మలకుంట, కట్టమల్ల నుంచి గరీభ్ నగర్, ఎస్‌ఆర్ నగర్, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో నాలాల ఆక్రమణలు కోకొల్లులు. కాజీపేట సోమిడి చెరువు, బంధం చెరువు, తదితర ప్రాంతాల్లో వివాదాస్పద సమస్యలున్నాయి. ప్రస్తుతం ‘కుడా’ సమర్పించిన డీపీఆర్‌లో నగరవ్యాప్తంగా 95 కిలోమీటర్ల విస్తీర్ణంలో వరద నీటి కాల్వలు, కల్వర్టులు నిర్మించాలని నిర్ణయించారు. హైడ్రా వంటి చట్టం ఇక్కడ కూడా అమలైతే తప్ప.. నాలాల విస్తరణ సాధ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


