సాక్షి, వరంగల్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్ల నమోదుకు వరంగల్ జిల్లాలో పట్టభద్రుల నుంచి భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. కానీ, వాటి పరిశీలన, ఆమోద ప్రక్రియ మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో ఇప్పటివరకు 56,407 దరఖాస్తులు (56,367 ఆన్‌లైన్, 40 ఆఫ్‌లైన్) అందగా.. వీటిలో 10,956 మాత్రమే ఆమోదం పొందాయి. మరో 553 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 44,898 దరఖాస్తులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి. బుధవారం నాటికి గణాంకాలు పరిశీలిస్తే దరఖాస్తుల స్వీకరణకు, పరిష్కారానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన అధికార పార్టీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించాయి.
అత్యధిక పెండింగ్ ఇక్కడే..
దరఖాస్తుల పరిష్కారంలోనూ మండలాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలోని వరంగల్ మండలంలో 11,808 దరఖాస్తులు రాగా, 11,393 పెండింగ్‌లో ఉన్నాయి. ఖిలా వరంగల్‌లో 10,236 దరఖాస్తులు రాగా, 9,926 పరిష్కారం కావాల్సి ఉంది. మిగతా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
వివిధ దశల్లో 44 వేలకుపైగా...
మొత్తం పెండింగ్ దరఖాస్తుల్లో 6,133 ఇంకా అన్‌న్ ప్రాసెస్డ్ (ఇంకా ప్రాసెస్ చేయని) దశలో ఉన్నాయి. 36,778 దరఖాస్తులు బ్లాక్ అసైన్‌న్‌మెంట్ కేటగిరీలో, 1,027 ఏఈఆర్‌ఓ స్థాయిలో, 960 ఈఆర్‌ఓ స్థాయిలో ఉన్నట్లు డ్యాష్‌బోర్డులో నమోదైంది. దీంతో దరఖాస్తుల పరిశీలనను అధికారులు వేగవంతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
వరంగల్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో మందగమనం
56,407 దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటివరకు 10,956
అప్లికేషన్స్ అప్రూవ్డ్
ఇంకా పెండింగ్‌లోనే 44,898 అర్జీలు


