న్యూస్‌రీల్
హసన్‌పర్తి: ప్రస్తుతం సైబర్ నేరాలు, సోషల్ మీడియా మోసాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, మహిళలు, చిన్నారులపై జరిగే ఘోరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, దృష్టి మరల్చి చేసే దొంగతనాల విస్తృతి పెరిగింది. దీంతోపాటు జూదం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. వీటిని అరికట్టడంతోపాటు ప్రజల భద్రతకు మొదటి ప్రాధాన్యమిస్తూ.. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడమే కాకుండా, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత కమ్యూనిటీ కనెక్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులే ప్రజల వద్దకు వెళ్లి, వివిధ రకాల నేరాలు, మోసాల నివారణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
మొదట 9పీఎస్‌లలో అమలు
ఈ కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని మొదట గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలు చేస్తారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు విస్తరించనున్నారు. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటూ, నేరాల నివారణపై అవసరమైన సూచనలు అందిస్తారు. ప్రతి ఇంటికి చేరువై ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా పోలీస్ శాఖకు, ప్రజలకు మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు.
● ప్రజల వద్దకు పోలీసులు..
వివిధ నేరాలపై అవగాహన
● నేర రహిత సమాజ నిర్మాణానికి దోహదం
● పోలీస్‌శాఖ, ప్రజల మధ్య
సంబంధం మరింత బలోపేతం
● మొదట నగరంలోని
తొమ్మిది పోలీస్ స్టేషన్లలో అమలు
దృష్టి మరల్చి చేసే నేరాలు
ప్రజల దృష్టిని మరల్చి నగదు, నగలు, విలువైన వస్తువులను అపహరించే నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండడం, అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.


