తెరవెనుక ఉన్నదెవరు
సాక్షి ప్రతినిధి, వరంగల్:
ప్రభుత్వ ముద్ర ఉంటే చాలు.. నకిలీ పత్రమైనా నిజమైపోతోందా? రెవెన్యూ రికార్డుల్లో లేని వివరాలు బయట ఎలా ప్రత్యక్షమవుతున్నాయి? అధికారుల సంతకాలు, కార్యాలయ ముద్రలు అక్రమార్కుల చేతికి ఎలా చేరుతున్నాయి? ఉమ్మడి వరంగల్‌లో వరుసగా వెలుగుచూస్తున్న నకిలీ ధ్రువపత్రాల ఉదంతాలు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తాజాగా శాయంపేట మండలంలో జారీ చేసినట్లు చూపిన నకిలీ కుల ధ్రువపత్రంతో హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగం పొందిన వరంగల్ వాసికి రెండేళ్ల జైలు శిక్ష పడిన ఉదంతం కలకలం రేపింది. 1996 నాటి ధ్రువపత్రం.. 1997లో ఉద్యోగం.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత న్యాయస్థానంలో నేర నిర్ధారణ జరిగింది. హిమాచల్ హైకోర్టు నిర్ణయాన్ని గత నెల 30న సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ ఒక్క ఉదంతమే కాదు. గతంలోనూ ఉమ్మడి వరంగల్‌లో నకిలీ పట్టాలు, ధ్రువపత్రాలు, అధికారుల ముద్రల ఫోర్జరీ వ్యవహారాలు బయటపడ్డాయి.
మాజీ వీఏఓ ఇంట్లోనే ‘ఫోర్జరీ’ ఫ్యాక్టరీ..
2022, నవంబర్‌లో నెక్కొండకు చెందిన మాజీ వీఏఓ మద్ది వెంకటరెడ్డి, మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఆర్డీఓ భూ మార్పిడి ఉత్తర్వులు, బ్యాంకు రుణాల ఫారాలు, తహసీల్దార్ కార్యాలయాల ముద్రలు, పాత మ్యుటేషన్ ఫైళ్లు లభించాయి. రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి నకిలీ పత్రాలు తయారు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నెక్కొండ, పర్వతగిరి పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
460 మందికి 640 నకిలీ సర్టిఫికెట్లు!
2024లో వరంగల్ కేంద్రంగా మరో భారీ దందా వెలుగుచూసింది. తహసీల్దార్ సంతకాలు, ప్రభుత్వ ముద్రలను ఫోర్జరీ చేసి ఆదాయ, కుటుంబ సభ్యుల, డిపెండెంట్, మనీలెండింగ్ తదితర ధ్రువపత్రాలు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడితో పాటు డీటీపీ ఆపరేటర్, స్టాంపు వెండర్, మధ్యవర్తులు, పత్రాలు పొందినవారిపై చర్యలు చేపట్టారు. 460 మందికి 640 నకిలీ ధ్రువపత్రాలు జారీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2025లో మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోవడం ఈ వ్యవహారం విస్తృతిని చాటింది.
పోడు పట్టాలకూ నకిలీ ముద్ర!
2024, అక్టోబర్‌లో ములుగు కేంద్రంగా అటవీ హక్కుల పట్టాల ఫోర్జరీ వ్యవహారం బయటపడింది. ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో 400కు పైగా నకిలీ పోడు పట్టాలు తయారైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కలెక్టర్లు, అటవీ అధికారుల డిజిటల్ సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు రూపొందించినట్లు ఆరోపణలు వచ్చాయి.
చలాన్లలోనూ డిజిటల్ మాయాజాలం..
ఈ ఏడాది జనవరిలో జనగామ జిల్లాలో భూ రిజిస్ట్రేషన్ చలాన్లలో అక్రమాలు వెలుగుచూశాయి. భూ యజమానుల నుంచి పూర్తి మొత్తాలు వసూలు చేసి, ప్రభుత్వ ఖజానాకు తక్కువ మొత్తం జమ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జనగామ, భువనగిరి జిల్లాల్లో ధరణి, భూభారతి లావాదేవీలకు సంబంధించిన 1,080 డాక్యుమెంట్లలో అక్రమాలను గుర్తించిన పోలీసులు 22 కేసులు నమోదు చేసి 15మందిని అరెస్టు చేసినట్లు వెల్లడైంది.
రెవెన్యూ రికార్డుల వెనుక అసలు దందా..
పాత తప్పిదాలే పునరావృతం..
ధ్రువపత్రాల అక్రమాలపై
విచారణలు ఎక్కడ?
నకిలీ కులపత్రంతో హిమాచల్‌లో కొలువు.. వరంగల్ వాసికి జైలు
మాజీ వీఏఓ చేతిలో ఫోర్జరీ పత్రాలు.. పాస్‌పుస్తకాలనుంచి ముద్రల వరకు నకిలీ
గత కేసుల్లో దర్యాప్తు..
బాధ్యులపై చర్యలే కీలకం
ఆరు జిల్లాల్లో ప్రత్యేక
తనిఖీలు అవసరం..
ఆరు జిల్లాల్లో పాత కుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, పోడు పట్టాలు, మ్యుటేషన్లు, భూ మార్పిడి ఉత్తర్వులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.
జారీ రిజిస్టర్లు, అసలు దరఖాస్తులు, క్షేత్రస్థాయి విచారణ నివేదికలు, డిజిటల్ సంతకాలను సరిపోల్చాలి.
నకిలీ పత్రాలు తయారు చేసినవారితో పాటు వాటికి సహకరించినట్లు తేలిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలి.
నకిలీ పత్రం బయటపడడం ఒక ఎత్తు.. దాని వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడం మరో ఎత్తు.
మధ్యలో ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చి, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రాబట్టి, బాధ్యులకు శిక్ష పడితేనే రెవెన్యూ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
వరుసగా నకిలీ పత్రాలు బయటపడుతున్నా.. వాటి తయారీకి అవసరమైన ప్రభుత్వ రికార్డులు, సంతకాలు, ముద్రలు, డిజిటల్ వివరాలు అక్రమార్కులకు ఎలా అందుతున్నాయన్నది కీలక ప్రశ్న. కేవలం మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తుల అరెస్టులతోనే ఈ వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతుందా? కార్యాలయాల్లోని సిబ్బంది, అధికారుల పాత్రపై లోతైన విచారణ జరిగిందా? గత కేసుల్లో చార్జిషీట్లు, శాఖాపరమైన చర్యలు, శిక్షల పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది.


