హన్మకొండ: అర్నబ్ తుపాను వల్ల భారీ వర్షాలు పడతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. గతేడాది ఇదే సమయంలో మోంథా తుపాను ప్రభావంగా మెగా విస్పోటనం జరిగి రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా విధ్వంసం జరిగింది. పంటలు దెబ్బతినడంతో పాటు, కాలనీలు నీటమునిగాయి. రోడ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమయ్యాయి. అదే తీరుగా అర్నబ్ తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ విశ్లేషించింది. కానీ, చినుకు జాడ కనిపించలేదు. చివరకు తుపాను ఊరించి ఉసూరుమనిపించింది. ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం మాత్రమే కురిసింది. ఇప్పుడు వర్షం కురిస్తే పంటలకు తీవ్ర నష్టం కలిగేది. వరి పంట కోత దశలో ఉంది. పత్తి ఏరివేత దశలో ఉంది. భారీ వర్షం పడితే తీవ్ర నష్టం జరిగేదని రైతులు తెలిపారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న క్రమంలో అందరి ఆశ, దృష్టి అర్నబ్ తుపానుపై సారించారు. కానీ, వర్షం ఉసూరుమనిపించింది.
గతేడాది ఇలా..
గతేడాది ఇదే నెలలో మోంథా తుపాన్ ఇదే సమయంలో విధ్వంసం సృష్టించింది. అక్టోబర్ 28న రాత్రి కుండపోత వర్షం కురిసింది. 29న ఉదయం నుంచి వరదలు పోటెత్తాయి. హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో కాలనీలు జలమయమయ్యాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 37.55 సెంటీమీటర్లు, నెక్కొండ మండలం రెడ్లవాడలో 32.60, సంగెం మండలం కాపుల కనపర్తిలో 31.43, వరంగల్ ఉర్సులో 30.1, పాలకుర్తి మండలం గూడూరులో 26.93 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా ప్రాంతాల్లో 10.25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వర్ష బీభత్సానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు అలుగులు పోశాయి. రహదారులు గోదారులను తలపించాయి. కానీ, ఈ ఏడాది చినుకు జాడలేదు.
భారీ వర్షాలు పడతాయని
ఆశించిన ప్రజలు
హనుమకొండలో జాడలేని చినుకు
మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు
గతేడాది అక్టోబర్ 29, 30న
విధ్వంసం సృష్టించిన మోంథా తుపాను


