వరంగల్ అర్బన్: వానరాల నుంచి నగర ప్రజలను రక్షించేందుకు నిర్వహించిన ఇ–ప్రొక్యూర్‌మెంట్ టెండర్లకు ఎవ్వరూ ముందుకు రావట్లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన నాలుగు కుటుంబాల వాసులు మాత్రమే టెండర్ తీసుకునేందుకు ఏటా సంసిద్ధులవుతున్నారు. గత రెండు దశాబ్దాలుగా బల్దియాలో ఇదే తంతు రిపీట్ అవుతోంది. ఆ నాలుగు కుటుంబాల వారికి విద్యాభ్యాసం లేదు. దీంతో ఇ–ప్రొక్యూర్‌మెంట్ గతంలో పిలిస్తే ఎవరూ టెండర్ వేయలేదు. ఈనేపథ్యంలో బాక్స్ టెండర్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తున్నారు.
ఒక్కో కోతికి రూ.810 చెల్లించాలి: టెండర్‌దారులు
కోతులను కాలనీల్లో పట్టుకొని ఏటూరునాగారం అడవుల్లో వదిలేసేందుకు వారం క్రితం టెండర్లు పిలిచారు. కాశిబుగ్గ సర్కిల్ పరిధిలో 2 షెడ్యూల్, కాజీపేట సర్కిల్ 4 షెడ్యూల్ పత్రాలు తీసుకున్నారు. తీరా.. గురువారం ఉదయం టెండర్లను బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా కార్యాలయంలో బాక్స్ టెండర్ ఓపెన్ చేశారు. అందులో కాశిబుగ్గకు ఇద్దరు, కాజీపేటకు అదే ఇద్దరు కాంట్రాక్టర్లు హాజరయ్యారు. కానీ, వీరు కాశిబుగ్గకు ఒకరు, కాజీపేట ఒకరు ఈఎండీలు మాత్రమే సమర్పించారు. అంతేకాకుండా శివయ్య, నాగేశ్వర్‌రావు అనే కాంట్రాక్టర్లు ఒక్కో కొతిని పట్టుకునేందుకు రూ.810 చొప్పున చెల్లిస్తేనే కోతులను పట్టుకొని తరలిస్తామని టెండర్లు వేశారు. ఒక్కో టెండర్ కావడంతో బల్దియా అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారు. గతేడాది కాజీపేట, కాశిబుగ్గ సర్కిళ్లలో ఒక్కో కోతిని పట్టుకునేందుకు రూ.520 చొప్పున చెల్లించారు. ఈఎండీని కాశిబుగ్గకు ఒకరు, కాజీపేటకు మరొకరు చెల్లించారు. వాస్తవానికి ఇది టెండర్ నిబంధనలకు విరుద్ధం. కానీ, నగరంలో ఉన్న కోతుల సమస్యను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఆ ఇద్దరు వ్యక్తులతో చర్చించారు. టెండర్ నిబంధనల మేరకు గతేడాది కంటే పదిశాతం అదనంగా చెల్లించి టెండర్ ఒప్పందం చేసుకోవాలని కోరారు. అందుకు ఆ ఇద్దరు కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. ఈవిషయాన్ని కమిషనర్ టి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. టెండర్ ప్రక్రియలో బల్దియా సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్, గోపాల్‌రావు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఖరారు కాని టెండర్లు.. కమిషనర్‌కు నివేదిక


