హన్మకొండ: అర్నబ్ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలో తీసుకుంటున్న ముందస్తు చర్యలు, అధికారులకు చేసిన దిశానిర్దేశం తదితర అంశాలను బుధవారం ఆయన ‘సాక్షి‘కి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. అర్నబ్ తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఖమ్మం, భద్రాద్రి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తీవ్రంగా ఉండే అవకాశముంది. ఆ తర్వా త హనుమకొండ, వరంగల్ జిల్లాతోపాటు గోదా వరి పొడుగున ఉన్న జిల్లాల్లోనూ ప్రభావం ఉండనుంది. మెన్, మెటీరియల్‌తో సిద్ధంగా ఉన్నాం. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే వెనువెంటనే పునరుద్ధరించి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం. అధికారులు, సిబ్బందిని అత్యవసర మరమ్మతులకు అవసరమైన సామగ్రితో సిద్ధంగా ఉండాలని సూచించాం. విద్యుత్ అంతరాయాలు, సరఫరాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వినియోగదారులు 1912 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలి. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు. వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించాలి. ఆంధ్ర ప్రదేశ్ వారు మన సపోర్టు కావాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీలను పంపాలని కోరారు. ఈదురు గాలుల తీవ్రతను బట్టి నష్టం జరుగుతుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో తుపాను తీవ్రతను బట్టి ఆలోచిస్తామని వారికి చెప్పాం.
వినియోగం, డిమాండ్ పెరిగింది..
ఈ సెప్టెంబర్, అక్టోబర్‌లో విద్యుత్ వినియోగం, డిమాండ్ గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్‌లో ఆల్‌టైం రికార్డు 6,948 మెగావాట్ల డిమాండ్‌కు చేరుకుంది. భూగర్భ జలాలు పడిపోవడంతో రైతులు సాగునీటి కోసం కాల్వలు, బావులకు అదనపు మోటార్లు వాడడంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. దీని ప్రభావం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై పడింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలా బాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూగర్భ జలా లు అడుగంటిపోవడంతో ప్రభావం చూపింది. లోడ్ పెరిగి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలినా త్వరితగతిన వాటిని మార్చాం. ఈ మేరకు రెండు నెలలకు సరిపడా రోలింగ్ స్టాక్ అందుబాటులో ఉంచుకున్నాం. దీంతోపాటు స్టోర్స్‌లోనూ నూతన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయి.
అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు
హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత వరంగల్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేయనున్నాం. ఈ వ్యవస్థతో లైన్‌లాస్, విద్యుత్ నష్టాలు తగ్గుతాయి.
అవసరమైన మ్యాన్‌పవర్, మెటీరియల్ సిద్ధం
దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ వెనువెంటనే పునరుద్ధరణ ● ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా విద్యుత్ సరఫరా
ఎల్‌నినోతో విద్యుత్ వినియోగం, డిమాండ్ పెరిగింది ● వచ్చే వేసవికి ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాం
‘సాక్షి’తో టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
వేసవిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాం..
ఎల్ నినో ప్రభావంతో ఈసారి యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశముంది. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖల అఽధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు, ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే వేసవిని ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాం. గృహ విద్యుత్ వినియోగం పెరిగే అవకాశముంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో కొత్తగా 50 సబ్‌స్టేషన్లు నిర్మించనున్నాం. అదే విధంగా అదనంగా 400 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నాం. కొత్తలైన్లు వేయనున్నాం. జనవరి వరకు వేసవి పనులు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నాం.


