హన్మకొండ అర్బన్: పరకాల పరిధిలోని జాతీయ రహదారి–163జీ నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన పలు శాఖల అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, లింగయ్య, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్లు విజయలక్ష్మి, ప్రవీణ్‌కుమార్, జ్యోతి వరలక్ష్మీదేవి, భూసేకరణ విభాగం సూపరింటెండెంట్ జగత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 82 రోజుల హుండీ ఆదాయం రూ.4,99,742, పూజల ద్వారా రూ.8,87,500 సమకూరింది. మొత్తం ఆదాయం రూ.13,87,242 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ పరిశీలకురాలు నందనం కవిత, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది, హనుమకొండ పోలీస్‌స్టేషన్ సిబ్బంది, రాజరాజేశ్వరి మహిళా సమాఖ్య బాధ్యులు పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: గ్రామీణాభివృద్ధిలో యువజన అధికారులు కీలకపాత్ర పోషించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు సూచించారు. మైభారత్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఈనెల 27 నుంచి 30 వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన యువజన అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పరశురాములు మాట్లాడుతూ యువజన అధికారులు అంకితభావంతో పనిచేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. మై భారత్ హనుమకొండ జిల్లా యువజన అధికారి సంజయ్‌నాయక్, నాగాలాండ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, జార్ఖండ్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల యువజన అధికారులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: హైదరాబాద్‌లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో ఈనెల 31న నిర్వహించనున్న సమూహ యువ సాహిత్యోత్సవాన్ని విజయవంతం చేయాలని సమూహ కార్యవర్గసభ్యులు కాత్యాయనీ విద్మహే, మెట్టు రవీందర్, బిల్ల మహేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్ సెంటర్‌లో కార్యక్రమ కరపత్రం, వాల్‌పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఉత్సవంలో ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. కవులు గంట రాంరెడ్డి, నిధి, డాక్టర్ బండారు సుజాత, జోగు అంజయ్య, సంజీవరెడ్డి, అకునూరి విద్యాదేవి, సింగరాజు రమాదేవి, పల్లేరు వీరస్వామి, మహేందర్ పాల్గొన్నారు.


