వరంగల్ లీగల్: ప్రజలకు ఉచిత న్యాయ సాయం అందించడంతో పాటు న్యాయ సేవలను మారుమూల ప్రాంతాలకు చేరువచేసేందుకు మొబైల్ లోక్‌అదాలత్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం ఆమె జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ.. వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఈ వాహనాన్ని కేటాయించినట్లు తెలిపారు. దీని ద్వారా ప్రజలకు న్యాయ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత న్యాయ సాయం పొందే విధానంపై సమాచారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, కార్మికులు, గ్రామీణులకు ఈ వాహనం ద్వారా న్యాయ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. నెలవారీ షెడ్యూల్ ప్రకారం వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆర్టికల్ 39–ఏ స్ఫూర్తితో అర్హులకు ఉచిత న్యాయ సాయం అందించడం, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశాలు కల్పించడమే న్యాయ సేవాధికార సంస్థల లక్ష్యమని తెలిపారు. పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ
జిల్లా కోర్టులో మొబైల్ లోక్ అదాలత్ వాహనం ప్రారంభం


