అప్పులు చేసి బోర్లు వేసిన..
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఈ ఏడాది ఐదు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో డబ్బులు పోయినా ఫర్వాలేదు అని 6 నెలల క్రితం రూ.8 లక్షలు పెట్టి బావి తవ్విన. బావిలో కూడా నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. ప్రతీ సంవత్సరం ఐదెకరాల్లో వరి సాగు చేయగా ఈసారి నీళ్లు లేకపోవడంతో నాటు వేయకుండా వదిలి పెట్టిన.
– మ్యాకల యాదయ్య, పీచర
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, వరంగల్ : ఒకప్పుడు బోరు మోటారు ఆన్ చేస్తే పొలానికి నీరు.. బావిలోకి తొంగిచూస్తే నీరు.. వర్షం కురిస్తే చెరువులు, కుంటలు నిండేవి. ఇప్పుడు పరిస్థితి మారింది. బోరు ఉంది.. నీరు లేదు. బావి ఉంది.. అడుగంటిపోయింది. పొలం ఉంది.. పంట లేదు. వర్షం కోసం ఆకాశం వైపు చూసిన రైతు.. ఇప్పుడు భూగర్భజలం కోసం నేలవైపు చూస్తున్నాడు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కరువు ప్రాంతాలపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్ట్.
ఉరుముతున్న కరువు..
హనుమకొండ జిల్లాలోని మొత్తం 14 మండలాలూ కరువు ప్రభావిత జాబితాలోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సెప్టెంబర్ 30 జిల్లాలో 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. అక్టోబర్ 23 నాటికి రాష్ట్రంలోని పూర్తిగా లోటు వర్షపాతం ఉన్న జిల్లాల్లో హనుమకొండ కూడా చేరింది. వరంగల్ జిల్లాలోని ప్రతి మండలంలోని 10 శాతం గ్రామాలను నమూనాగా తీసుకున్న అధికారులు కరువు ప్రభావాన్ని అంచనా వేసి ఎనిమిదింటిని కరువు మండలాలుగా ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాగు అంచనా 2,38,964 ఎకరాలు కాగా, 2,13,435 ఎకరాలు సాగైంది. అంటే 89శాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో ప్రకటించిన ఎనిమిది కరువు మండలాల్లో 35,759 ఎకరాల్లో వరి, 72,144 ఎకరాల్లో పత్తితో పాటు ఇతర పంటలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ మండలాల్లో సాగు చేసిన వరి పంటకు నీరందలేదు. దీంతో చాలా చోట్ల ఎండిపోయి పొలాలు బీళ్లుగా మారుతున్నాయి.
అడుగంటిన భూగర్భ జలాలు..
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కరువు తీవ్రతకు ముందుగానే సంకేతమిచ్చింది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు అక్కడ సాధారణ వర్షపాతంతో పోలిస్తే 64 శాతం లోటు నమోదైంది. రాష్ట్రంలో తీవ్రమైన వర్షపాతం లోటు ఉన్న మండలాల జాబితాలో ఆత్మకూరు నిలిచింది. శాయంపేట, ఆత్మకూరు, ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కమలాపూర్, దామెర, హనుమకొండ, కాజీపేట, నడికూడ, పరకాల మండలాల్లో 32 నుంచి 54 శాతం వర్షపాతం లోటు ఉండగా భూగర్భజల నీటి మట్టం ఒక్క నెలలోనే 5.98 మీటర్ల నుంచి 9.10 మీటర్లకు పడిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతా మండలాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 58 శాతం లోటు నమోదు కాగా, ఖిలా వరంగల్‌లో 45 శాతం, నెక్కొండలో 44 శాతం లోటు ఉంది. అక్టోబర్ 28 నాటికి జిల్లాలోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 471 చెరువుల్లో 305 చెరువుల్లో పావు వంతు నీటి నిల్వ కూడా లేదు. ఒక్క చెరువు కూడా అలుగు పారకపోవడం ఇక్కడి సమస్య తీవ్రతను స్పష్టం చేస్తోంది. అలాగే, భూగర్భ జలమట్టం జిల్లా సగటు 5.60 మీటర్లకు తగ్గడం కలవరానికి గురిచేస్తోంది.
అడుగంటిన బోర్లు, బావులు..
మాడిపోయిన వరి, మొక్కజొన్న
నీటి కోసం కొత్త బోర్లు.. ట్యాంకర్లు.. కిలోమీటర్ల మేర పైపులైన్లు


