కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని సైన్స్ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఈనెల 31వ తేదీవరకు పొడిగించినట్లు కేయూ సైన్స్ విభాగాల డీన్ బి. వెంకట్రామ్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలోతెలిపారు. ఈనెల24వతేదీతో గడువు ముగియగా 31వరకు పొడిగించామని, ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తులను కేయూలోని డీన్ కార్యాలయంలో సమర్పించాలని వెంకట్రామ్ రెడ్డి సూచించారు.
కాజీపేట జంక్షన్లో
రైల్వే గ్రీవెన్స్ మేళా
● పలు సమస్యలపై ఉద్యోగుల వినతి
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే కమ్యూనిటీహల్లో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ మే ళా (ఉద్యోగుల సమస్యల పరిష్కార శిబిరం) ను సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డీపీఓ ఆనంద్ కట్ట ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కాజీపేట సబ్ డివిజన్ పరిధి నుంచి రైల్వే ఉద్యోగులు తరలొచ్చి శిబిరంలో పాల్గొన్నారు. సర్వీస్ రికార్డు, సీనియార్టీ లిస్ట్, హెచ్ఆర్ఎంఎస్, పెన్షన్ సమస్యలు, పేఅండ్ అలవెన్స్, రెగ్యులర్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, తది తర సమస్యలపై ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించారు. స్థానికంగా కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించి పాలసీకి సంబంధించిన సమస్యలను పరిశీలించి పరిష్కరించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గ్రీవెన్స్‌లో వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు సి.వి.వి.రెడ్డి, ధర్మేంద్ర పద్మారావు, సెల్ సీనియర్ క్లర్క్ వికాశ్‌కుమార్, ఓఎస్‌లు యశ్పాల్సింగ్, డి.సత్యనారాయణ, వి.కృష్ణ, పి.సురేశ్‌బాబు, జమునారాణి, కె.లక్ష్మణ్‌రావు, రైల్వే ఇన్స్టిట్యూట్ కార్యవర్గ సభ్యుడు దేవులపల్లి రాఘవేందర్, మేరుగు రాజయ్య, గిరిమిట్ల రాజేశ్వర్‌రావు, పి.ప్రవీణ్, రవికిరణ్, సమ్మద్ పాషా, సారంగపాణి, హరి, నాగరాజు అనిల్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
హేమాచలక్షేత్రంలో ‘హైడ్రా’ కమిషనర్ కుటుంబ సభ్యులు
మంగపేట: ములుగు జిల్లా మగపేట మండల పరిధిలోని మల్లూరులోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి వారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కుటుంబ సభ్యులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన రంగనాథ్ సతీమణి, కుమార్తెకు అధికారులు, పూజారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. వారి గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించారు. స్వామివారి శేష వస్త్రాలు బహూకరించి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట మంగపేట రెండో ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
బీటెక్ విద్యార్థిని
ఆత్మహత్య
● టీవీ టవర్ కాలనీలో ఘటన
నయీంనగర్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ టీవీ టవర్ కాలనీలో చోటు చేసుకుంది. సుబేదారి ఎస్హెచ్ఓ ఎం.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చెందిన చుందు శివ హాసిని(18) హైదరాబాద్ తీగల కృష్ణారెడ్డి కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి గణేశ్ మేసీ్త్ర పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల శివ హాసిని తల్లికి శస్త్రచికిత్స జరగడంతో రూ.18 లక్షల వరకు ఖర్చు అయ్యింది. దీంతో శివ హాసిని చదువు ఖర్చులు భరించడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పరీక్ష ఫీజు చెల్లించాలని కళాశాల నుంచి ఫోన్ రావడంతో తండ్రి ఈ నెల 27న హైదరాబాద్‌కు వెళ్లి కూతురును ఇంటికి తీసుకొచ్చాడు. చదువు కొనసాగించడం కష్టంగా ఉందని, వివాహం చేస్తానని కుమార్తెతో చెప్పారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తండ్రి పనికి వెళ్లగా మధ్యాహ్నం శివ హాసిని తన బెడ్రూమ్లో ఫ్యాన్‌కు ఉరేసుకోవడం తల్లి గమనించింది. వెంటనే తండ్రికి సమాచారమిచ్చి కుటుంబీకులు, ఇతరుల సాయంతో గది తలుపులు తెరిచి చూడగా అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


