గంజాయి సొమ్ముతో ఆస్తులు.. | - | Sakshi
Sakshi News home page

గంజాయి సొమ్ముతో ఆస్తులు..

Oct 29 2026 1:12 AM | Updated on Oct 29 2026 1:12 AM

రూ.70.39లక్షల విలువైన ఆస్తులు

ఫ్రీజ్‌ చేసిన ఈగల్‌ ఫోర్స్‌

ఆస్తుల జప్తు ఇలా..

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: గంజాయి అక్రమ రవాణాతో సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులపై తెలంగాణ ఈగల్‌ఫోర్స్‌ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్‌ రవాణా కేసుల్లో నిందితులను అరెస్ట్‌ చేయడమే కాకుండా.. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించి జప్తు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. వరంగల్‌ నార్కొటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు సంబంధించిన సుమారు రూ.70.39 లక్షల విలువైన ఆస్తులను ఫ్రీజ్‌ చేసి జప్తు చేసినట్లు ఆ శాఖ ఉన్నతాకారులు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

147.300 కిలోల గంజాయి పట్టివేత..

వరంగల్‌ నార్కొటిక్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 01/2025గా ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద నమోదైన కేసులో పోలీసులు 147.300 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గంజాయి రవాణాకు ఉపయోగించిన ఇన్నోవా, స్విఫ్ట్‌ కార్లతోపాటు మూడు మొబైల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. నెరెళ్ల సదయ్య అలియాస్‌ సతీశ్‌, సామల శేషు, కిలో సోమరాజు, మునావర్‌ అలీని నిందితులుగా గుర్తించారు.

‘ఫాలో ది మనీ’.. ఆస్తులపై నిఘా..

గంజాయి అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఆదాయం ఎక్కడికి చేరింది? ఆ డబ్బుతో ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేశారు? అనే కోణంలో ఈగల్‌ఫోర్స్‌ దర్యాప్తు చేపట్టింది. ఇన్‌స్పెక్టర్‌ బి.రవీందర్‌ ఆధ్వర్యంలో నిందితులు, వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, స్థిర, చరాస్తుల వివరాలను పరిశీలించారు. సేల్‌ డీడ్లు, ఆస్తి పన్ను రసీదులు, భవన నిర్మాణ అనుమతులు, రెవెన్యూ రికార్డులను తనిఖీ చేసి ఆస్తుల మూలాలను గుర్తించారు.

అక్రమ సంపాదనకు అడ్డుకట్టే లక్ష్యం

డ్రగ్స్‌ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్మును ఇతర ఆస్తుల రూపంలోకి మార్చి చట్టబద్ధమైన సంపదగా చూపించే ప్రయత్నాలను అడ్డుకోవడమే ఈ చర్యల ఉద్దేశం. ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 68ఎఫ్‌ ప్రకారం ఆస్తులను ఫ్రీజ్‌ చేసే చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. డ్రగ్స్‌ సరఫరా వెనుక ఉన్న ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ.. ఈ అక్రమ వ్యాపారాన్ని లాభసాటిగా మారకుండా నిరోధించడంపై ఈగల్‌ఫోర్స్‌ దృష్టి సారించిందని, గంజాయి నిల్వలు, రవాణా, విక్రయాలు లేదా డ్రగ్స్‌ సంబంధిత అక్రమ ఆర్థిక లావాదేవీలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

147 కిలోల గంజాయి పట్టివేత కేసులో కీలక చర్యలు

వ్యవసాయ భూమి, రెండు ప్లాట్లు,

ట్రాక్టర్‌, బైక్‌, బ్యాంకు ఖాతాలపై కొరడా

మునావర్‌ అలీ, అతని కుటుంబ సభ్యులకు చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని రూ.1,59,910ను ఫ్రీజ్‌ చేశారు.

కిలో సోమరాజు, సామల శేషు సోదరుడు సామల రాజుకు సంబంధించిన ట్రాక్టర్‌, బైక్‌(రూ.7.80 లక్షల విలువ)ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నెరెళ్ల సదయ్య, సామల శేషు బంధువులకు సంబంధించిన వ్యవసాయ భూమి, రెండు ఖాళీ స్థలాలను గుర్తించి జప్తు ప్రక్రియ చేపట్టారు. మొత్తంగా రూ.70,39,910 విలువైన ఆస్తులపై చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని కాంపిటెంట్‌ అథారిటీ ధ్రువీకరణ అనంతరం 2026 అక్టోబర్‌ 27 నాటికి ఆస్తుల జప్తు ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement