వీడియో వీక్షిస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

వీడియో వీక్షిస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

ఖిలా వరంగల్‌ : డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలనుకునే వారికి రవాణాశాఖ కొత్త విధానం అందుబాటులోకి తెచ్చింది. పరివాహన్‌ సారథి పోర్టల్‌ హోం పేజీ ద్వారా లెర్నింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎల్‌ఆర్‌ )పొందిన వారు శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌(డీఎల్‌) పరీక్షకు స్లాట్‌ బుక్‌ చేసుకునే ముందు ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సు పూర్తి చేయాలి. ఈవిధానంలో రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన కల్పించేందుకు వీడియో పాఠాలను అందిస్తున్నారు.

ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ఇకపై పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సరిపోదు. రహదారి భద్రతపై అవగాహన పెంచే వీడియో పాఠాలు పూర్తిగా వీక్షించాల్సిందే. లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందిన వారు శాశ్వత డ్రైవింగ్‌ లెసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే ముందు రవాణాశాఖ వీడియోను తప్పనిసరిగా చూడాలి. వీడియో వీక్షణ పూర్తయిన తర్వాతే శాశ్వత లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఈకొత్త విధానాన్ని ఉమ్మడి జిల్లాలోని వరంగల్‌, మహబూబాబాద్‌, హనుమకొండ, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు.

ఆన్‌లైన్‌లోనే వీడియో పాఠాలు..

ఇప్పటి వరకు లెర్నింగ్‌ లైసెన్స్‌ కోసం ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి, రవాణాశాఖ కార్యాలయంలో కంప్యూటర్‌ పరీక్ష రాయాల్సి వచ్చేది. లెర్నింగ్‌ లైసెన్స్‌ పొందిన నెల రోజుల తర్వాత శాశ్వత లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుని, డ్రైవింగ్‌ పరీక్షలో వాహనాన్ని నడిపి చూపించాల్సి ఉండేది. పాత విధానానికి స్వస్తి పలికి తాజాగా నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈప్రక్రియకు రహదారి భద్రతపై అవగాహన కల్పించే 2: 30 గంటల నిడివిగల 6 వీడియోల వీక్షణను జోడించారు. ఒక్కో వీడియో సుమారు 25 నిమిషాలు నిడివితో ఉంటుంది. ప్రతీ వీడియో అనంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. లెర్నింగ్‌ లైసెన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి మొబైల్‌ ఫోన్లకు మాత్రమే వీడియోకు సంబంధించిన లింక్‌ పంపిస్తారు.

ముఖగుర్తింపుతో పర్యవేక్షణ..

అభ్యర్థులు తమ లెర్నింగ్‌ లైసెన్స్‌ నంబర్‌, పుట్టిన తేదీన నమోదు చేసిన తర్వాత నమోదిత మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి లాగిన్‌ ప్రక్రియ పూర్తి చేయాలి. వివరాలు సరిపోకపోతే లేదా మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ రాకపోతే రవాణాశాఖ కార్యాలయాన్ని సంప్రదించి వివరాలను సరిచూసుకోవాలి. అభ్యర్థి ముఖాన్ని గుర్తించే సాంకేతికత ఆధారంగా వీడియో కొనసాగుతుంది. అభ్యర్థికి బదులు మరొకరు వీడియో చూసినా ప్రయోజనం ఉండదు. మధ్యలో విరామం తీసుకోవాలనుకుంటే వీడియోను కొంత సేపు నిలిపివేసి తిరిగి కొనసాగించొచ్చు.

వీడియో పూర్తయితేనే డీఎల్‌ స్లాట్‌ బుకింగ్‌..

ఆన్‌లైన్‌ శిక్షణ పూర్తయిన తర్వాత శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ కొనసాగించొచ్చు. ఇందుకోసం సంబంధిత సారథి పోర్టల్‌ డీఎల్‌ సేవలను ఎంచుకోవాలి. అందుబాటులో ఉన్న తేదీ, సమయాన్ని ఎంచుకుని సూచించిన ఫీజు చెల్లించాలి. అనంతరం కేటాయించిన తేదీన సంబంధిత ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్‌ పరీక్షకు హాజరు కావాలి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అధికారుల నమోదు పొందిన తర్వాతే శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ ఆవుతుంది.

లెర్నింగ్‌ లైసెన్స్‌ ఉన్న వారు

తప్పకుండా చూడాలి

శాశ్వత లైసెన్స్‌ కోసం రెండున్నర

గంటలు అవగాహన పాఠాలు

ఎల్‌ఎల్‌ఆర్‌ నంబర్‌, పుట్టిన తేదీతో లాగిన్‌.. మొబైల్‌కు ఓటీపీ

ఉమ్మడి జిల్లాలో ఈనెల 10 నుంచే కొత్త విధానం అమల్లోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement