కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ శాఖలోని అద్దె భవనాలకు శాశ్వత భవనాలను కేటాయించాలని జూలై 7న జీఓ ఆర్టీ నంబర్ 414ను ప్రభుత్వం విడుదల చేసింది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాల వివరాలు, శాశ్వత భవన నిర్మాణానికి స్థల సేకరణకు కలెక్టర్‌కు నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు డీఐజీ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నెలకు రూ.1,88,852 అద్దెల రూపంలో చెల్లిస్తోంది.
మూడు నెలల తర్వాత డీఐజీ కార్యాలయానికి ఎకరం భూమి..
ప్రభుత్వం జీఓ జారీ చేసిన మూడు నెలలకు ఉమ్మడి వరంగల్ జిల్లా డీఐజీ కార్యాలయానికి హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ పలివేల్పుల శివారు గుండ్లసింగారం వద్ద ఎకరం భూమి కేటాయించారు. ఇటీవల భూమిని రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించగా స్థలాన్ని చదును చేశారు. త్వరలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె ఆదా..
ఉమ్మడి వరంగల్ జిల్లా డీఐజీ కార్యాలయం హనుమకొండలోని నిట్ దగ్గరలో అద్దె భవనంలో కొనసాగుతోంది. నెలకు రూ.24,989 అద్దె చెల్లిస్తున్నారు. కలెక్టర్ కేటాయించిన ఎకరం భూమిలో అధునాత హంగులతో రూ.కోటితో డీఐజీ కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాలకు స్థలం కేటాయించి భవనాలను నిర్మిస్తే 1,88,852 రూపాయల అద్దె ఆదా అయ్యే అవకాశం ఉంది.
త్వరలో శాశ్వత భవన నిర్మాణానికి
శంకుస్థాపన
రూ. కోటితో ఆధునిక భవనం


