● ఉద్యమకారుల ఐక్యవేదిక
రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్
హన్మకొండ చౌరస్తా: హనుమకొండ జిల్లాలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర నవంబర్ 13 నుంచి 15వ వరకు చేపట్టనున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ తెలిపారు. హనుమకొండ కాకతీయకాలనీలోని ఐక్యవేదిక కార్యాలయంలో శనివారం వేదిక ముఖ్య నాయకుల విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర కన్వీనర్ ఓడపల్లి శ్యాంకృష్ణ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి రవికుమార్ హాజరై మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనకోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించకపోవడంతో గతపాలకులు అధికారానికి దూరమయ్యారని పేర్కొన్నారు. ఉద్యమకారులను అవమానించే ఎలాంటి వారైనా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం గడిచినా ఉద్యమకారుల జీవితాల్లో ఏమాత్రం సంతోషం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఓదార్పు యాత్ర ద్వారా 128 ఉద్యమకారుల కుటుంబాలను కలిసి, వారి జీవన విధానాన్ని రికార్డు చేశామన్నారు. 24 జనవరి 2027న వరంగల్ నగరంలో ఉద్యమకారుల మహారాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మలిదశ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ టీఎన్ స్వామి, వరంగల్ జిల్లా రాష్ట్ర కమిటీ కార్యదర్శి నారాయణరెడ్డి, రాష్ట్ర కమిటీ ప్రచార కార్యదర్శి జినుకుల లక్ష్మణ్ రావు, జిల్లా అధ్యక్షుడు దాసరి జనార్దన్ పాల్గొన్నారు.


