పేరుకుపోతున్న స్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

పేరుకుపోతున్న స్టాక్‌

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

కాశిబుగ్గ: వరంగల్‌ కొత్తవాడలోని పలు చేనేత సహకార సంఘాల్లో నేత ఉత్పత్తులు పేరుకుపోతున్నాయి. మూడు నెలలనుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రోజురోజుకూ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆయా సంఘాల్లో రెండు లక్షల చొప్పున బెడ్‌షీట్లు, కార్పెట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. ఎంతో కష్టపడి తయారు చేసిన ఉత్పత్తులకు సకాలంలో ఖరీదులు లేకపోవడంతో చేతినిండా పని లేకుండా పోతోందని నేత కార్మికులు వాపోతున్నారు. గతంలో చేనేత కార్మికులు తమ సమస్యల పరిష్కారంలో భాగంగా టెండర్‌ కొనుగోలు విధా నం రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ఆ సమయంలో సంబంధిత అధికారులు మూడు లక్షల వరకు ఉత్పత్తులను కొనుగోలు చేసి.. మిగతా వాటిని కూడా టెస్కో ద్వారా ఖరీదు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళన విరమించి, గత ఆగస్టు నుంచి తిరిగి నేత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అయితే ఉత్పత్తుల కొనుగోలుకు టెస్కో ద్వారా అధికారులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంలేదని వాపోతున్నారు.

టెండర్‌ విధానంతో

నేత ఉత్పత్తులకు ఇక్కట్లు..

ప్రభుత్వం టెండర్‌ విధానం అమలు చేయడం వల్ల నేత ఉత్పత్తులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దీనిపై పలు సంఘాల ప్రతినిధులు హైకోర్టుకు కూడా వెళ్లారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా విధానం ఉండాలని, అన్యాయం చేయకుండా వారిని ఆదుకోవాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అలాగే జీఓ నంబర్‌ –1 ప్రకారం టెస్కో ద్వారా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఉన్నా టెండర్‌ విధానానికి వెళ్లడంతో కార్మికులు గతంలో ఆందోళన చేపట్టారు. గతంలో మాదిరిగానే టెస్కో ద్వారా కొనుగోళ్లు చేపట్టి సంఘాల్లో స్టాక్‌ పేరుకుపోకుండా చూడాలని కోరుతున్నారు. దీనిపై పలుమార్లు చేనేత సంఘాల ప్రతినిధులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు, టెస్కో ద్వారా కొనుగోళ్లు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. చేనేత జౌళిశాఖ కమిషనర్‌ సవ్యసాచి ఘోష్‌ను కలిసినప్పుడు నేత ఉత్పత్తులను ఖరీదు చేస్తామని చెప్పారని వారు పేర్కొన్నారు.

నేత సంఘాల్లో కుప్పలుగా వస్త్రాలు

మూడు నెలలుగా కొనుగోళ్లు బంద్‌

టెస్కో ద్వారానే బెడ్‌షీట్లు,

కార్పెట్లు కొనుగోలు చేయాలి

చేనేత కార్మికుల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement