● మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్
హన్మకొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకే పట్టభద్రులు పట్టం కడుతారని.. పార్టీ నాయకులుచ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్స్‌ను కలవాలని మాజీ ఎంపీ, పట్టభద్రుల ఎన్నిక ఇన్‌చార్జ్ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని ఆయన స్వగృహంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. పట్టభద్రుల ఓటరు నమోదు పకడ్భందీగా చేపట్టాలన్నారు. ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, ఈ క్రమంలో ఓటరు నమోదు అత్యంత కీలకమన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులను కలిసి ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే డివిజన్‌ల వారీగా ఓటరు నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ల వారీగా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యులను నియమించినట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లు అత్యధికంగా నమోదయ్యేలా సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు హనుమకొండ స్నేహనగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్ హాల్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఎల్‌ఏలు, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్తలు, బాధ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, వద్దిరాజు గణేష్ పాల్గొన్నారు.


