కేంద్రం దృష్టి సారిస్తేనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : దేశంలో ప్రాంతీయ రైలు ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రవేశపెట్టిన నమో భారత్ ర్యాపిడ్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ సేవలు తెలంగాణకు మాత్రం ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ఈ తరహా రైలు సేవకు ఇంకా అవకాశం దక్కలేదు. తెలంగాణకు గేట్ వే వరంగల్ ప్రాంతంలో ప్రయాణికుల రద్దీ, ప్రాంతీయ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సికింద్రాబాద్–కరీంనగర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రవేశపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదిస్తే ఎంతో మేలు..
సికింద్రాబాద్ నుంచి వరంగల్.. వరంగల్ నుంచి కరీంనగర్ వరకు రోజూ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, రోగులు, ఇతర అవసరాల కోసం భారీగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల మధ్య రైళ్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలే ప్రధాన రవాణా మార్గాలు. వేగవంతమైన, ఆధునిక ర్యాపిడ్ రైలు అందుబాటులోకి వస్తే రోజువారీ ప్రయాణికులకు సమయం ఆదా కావడంతోపాటు రోడ్డు రవాణాపై ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్–కరీంనగర్ కారిడార్ రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను అనుసంధానిస్తోంది. ఈ మార్గంలో ఉద్యోగ, విద్య, వైద్య, వ్యాపార అవసరాలతో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో సాధారణ రైలు సేవలకు అదనంగా సెమీ హైస్పీడ్/ర్యాపిడ్ ఇంటర్‌సిటీ తరహా సేవను ప్రవేశపెట్టడం ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వరంగల్‌కు కూడా అనుసంధానం..
సికింద్రాబాద్–కరీంనగర్ మధ్య నమో భారత్ రైలు ప్రతిపాదనను పరిశీలించే సమయంలో వరంగల్ ప్రాంతాన్ని కూడా భవిష్యత్‌లో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలనే డిమాండ్ వినిపిస్తోంది. హైదరాబాద్–వరంగల్, వరంగల్–కరీంనగర్ ప్రాంతాల మధ్య ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండడంతో వేగవంతమైన రైలు కనెక్టివిటీ ఏర్పడితే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజలకు పెద్ద ఊరట కలుగుతుంది. కాగా, ఈ రైలు కనెక్టివిటీ ఏర్పడితే ఉమ్మడి వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వేగవంతమైన రైలు ప్రయాణం సాగనుంది. ఉద్యోగులు, విద్యార్థులకు సమయం ఆదా, వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌కు వెళ్లేవారికి సౌకర్యంగా ఉంటుంది. వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, వరంగల్–కరీంనగర్ ప్రాంతాల మధ్య ఆర్థిక అనుసంధానం బలోపేతం అవుతుంది.
తెలంగాణకు ఇప్పటి వరకు నమో భారత్ ర్యాపిడ్ ఇంటర్‌సిటీ రైలు సేవ అందుబాటులోకి రాకపోవడంతో కేంద్ర రైల్వే శాఖ, రైల్వే బోర్డు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు రాష్ట్రంలోని కీలక రూట్లపై అధ్యయనం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ – వరంగల్, వరంగల్ – కరీంనగర్ మార్గంలో ప్రయాణికుల రద్దీ, ప్రస్తుత రైలు సదుపాయాలు, ట్రాక్ సామర్థ్యం, స్టేషన్ల మౌలిక వసతులు పరిశీలించి నమో భారత్ ర్యాపిడ్ రైలు నడిపే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నమో భారత్ ర్యాపిడ్ రైళ్లకు ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు కూడా ఈ ఆధునిక రైలు సేవను తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్–కరీంనగర్ మార్గంతో ప్రారంభించి, వరంగల్ వరకు విస్తరించేలా ప్రణాళిక రూపొందిస్తే ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థలో కీలక మార్పు వస్తుందని భావిస్తున్నారు.
వేగవంతమైన రైలు కనెక్టివిటీ ఓరుగల్లుకు ఎప్పుడు
సికింద్రాబాద్–కరీంనగర్
మధ్య నడిపితే ప్రయోజనం
ఉత్తర తెలంగాణ రవాణా వ్యవస్థకు కీలకం ఈ రైలు..
తెలంగాణ గేట్‌వే ఓరుగల్లుపై ఎందుకు చిన్నచూపు?
కేంద్ర రైల్వే శాఖ చొరవ
తీసుకోవాలంటున్న ప్రయాణికులు


