వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో నేటి (శుక్రవారం) నుంచి నవంబర్ 3వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ల క్యాంపు కొనసాగనుంది. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, తెలంగాణ పర్యాటక శాఖ, ఇంటాక్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు చారిత్రక, పర్యాటక, వారసత్వ కట్టడాల గురించి దేశంలోని 10 రాష్ట్రాలకు చెందిన 35 మంది వలంటీర్లకు అవగాహన కల్పించనున్నారు.
2008లో తొలిసారి..
2008లో వరల్డ్ హెరిటేజ్ కార్యక్రమాన్ని యునెస్కో తొలిసారి ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ వారసత్వ కట్టడాలపై యువతి, యువకులకు అవగాహన కల్పిస్తారు. రామప్పలో తొలిసారిగా 2023 అక్టోబర్‌లో 12 రోజుల పాటు 40మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి రామప్ప ఆలయ నిర్మాణం, కాకతీయులు ఇంజనీరింగ్ టెక్నాలజీ, సంస్కృతి, కళలు, చరిత్రపై అవగాహన కల్పించారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రామప్ప ఆలయం గురించి వలంటీర్లు ప్రచారం నిర్వహించనున్నారు.
35 మంది ఎంపిక
చరిత్ర, కళలు, పురావస్తు, ఆర్కిటెక్చర్, సివిల్, ఇంజనీరింగ్ రంగాల్లో అవగాహన ఉన్న దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న యువతీయువకులను 35 మందిని ఎంపిక చేశారు. వలంటీర్ల ఎంపిక కోసం పలు రాష్ట్రాల నుంచి 132 దరఖాస్తులు రాగా, విదేశాల నుంచి 23 వచ్చాయి. ఇందులో 10 రాష్ట్రాల నుంచి 35 మందిని, విదేశాలకు చెందిన 5 మందిని ఎంపిక చేసినట్లు వరల్డ్ హెరిటేజ్ క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్ రావు తెలిపారు.
నేడు ప్రారంభం..
ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంరామప్ప ఆలయ పరిధిలో వరల్డ్ హెరిటేజ్ క్యాంపును శుక్రవారం కలెక్టర్ హేమంత్ సహదేవరావు ప్రారంభించనున్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, భారత పురావస్తు శాఖ, తెలంగాణ పర్యాటక శాఖల నుంచి ఉన్నతాధికారులు హాజరు కానున్నట్లు ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్ రావు తెలిపారు.
రామప్పలో 12రోజుల పాటు
వలంటీర్లకు శిక్షణ
10 రాష్ట్రాలకు చెందిన
35 మంది ఎంపిక
22 మంది నిపుణులతో
తరగతుల నిర్వహణ


