హసన్‌పర్తి: ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సూచించారు. క్యూవీఎస్‌ఈ(క్వాంటమ్ వెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ యాప్ ద్వారా పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్ క్రైం విభాగాలు హెచ్చరించాయని తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో మోసాల తీరు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.
రూ.54వేల పెట్టుబడితో లాభాలంటూ ఆశ..
సైబర్ నేరగాళ్లు క్యూవీఎస్‌ఈ యాప్ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలని బాధితులను ప్రేరేపిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. భారతీయ కరెన్సీని బినాన్స్ ఎక్స్చేంజ్ ద్వారా క్రిప్టో కరెన్సీగా మార్చి పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారని చెప్పారు. కనీసం 500 యూఎస్‌డీటీ (సుమారు రూ.54 వేలు)పెట్టుబడి పెడితే ఒక శాతం లాభం వస్తుందని ఆశ చూపుతున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఇతరులను యాప్‌లో చేర్పిస్తే మొదటి స్థాయి రిఫరల్‌కు 50 యూఎస్‌డీటీ, రెండో స్థాయి రిఫరల్‌కు 25 యూఎస్‌డీటీ చెల్లిస్తామని నమ్మిస్తున్నారని వివరించారు. ఈ తరహా మోసాలకు సంబంధించిన తెలంగాణలో ఇప్పటికి 56 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
జాగ్రత్తలు తప్పని సరి..
తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌లను గుడ్డిగా నమ్మొద్దు
● తెలియని వ్యక్తులు పంపే ఏపీకే ఫైళ్లు, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయొద్దు
● ధ్రువీకరించని ట్రేడింగ్ ప్లాట్ ఫారమ్‌లలో పెటుబడులు పెట్టొద్దు
● క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు బదిలీ చేయాలని కోరితే అప్రమత్తంగా ఉండాలి
● ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దు
మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయాలి..
కష్టపడి సంపాదించిన డబ్బును అధిక లాభాల ఆశతో కోల్పోవద్దని సీపీ శ్వేత సూచించారు. సైబర్ మోసానికిగురైతే వెంటనే 1930 జాతీయ సైబర్‌క్రైం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి. www. cybercrime. gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. సత్వర ఫిర్యాదుతో ఆర్థిక నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అప్రమత్తతతోనే సైబర్ మోసాలను అరికట్టొచ్చని, ఆన్‌లైన్ పెట్టుబడుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని సీపీ శ్వేత సూచించారు.
అధిక లాభాల ఆశతో పెట్టుబడి జోలికి వెళ్లొద్దు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత


