హన్మకొండ అర్బన్ : ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో ఏర్పడే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ టి.కె.శ్రీదేవి ఆదేశించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్లతో ఎల్‌నినోపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ నీటి కొరత ఏర్పడకముందే అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువులు, భూగర్భ జలాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, నీటి నిల్వలు తగ్గే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ వనరులు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి అవసరాలకు ఆటంకం కలగకుండా సాగునీటి వినియోగాన్ని ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. రాబోయే రబీ సీజన్‌న్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగును పరిమితం చేసి శనగలు, కందులు, పెసలు, ఇతర పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గ్రామాల వారీగా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేనప్పటికీ, భవిష్యత్‌లో నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, ఈఈ రవికుమార్, డీఏఓ విజయ్ చంద్ర, సాగునీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్ , విద్యుత్ శాఖ ఏడీఈ గంగారెడ్డి, భూగర్భ జల వనరుల శాఖ ఉప సంచాలకురాలు శైలశ్రీ మల్లికాదేవి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారి మధు తదితరులు పాల్గొన్నారు.
రబీలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి శ్రీదేవి


