హన్మకొండ: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకోవాలని, పచ్చదనంతోనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర జీవితం అందించిన వారమవుతామని మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం హనుమకొండలోని పద్మాక్షి గుట్ట వద్ద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సంతోష్ రావుతోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. అంతకు ముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. నేటికాలంలో పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, చెట్ల నరికివేత వంటి సమస్యలను అధిగమించాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించే బాధ్యత కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ, వన సేవా సొసైటీ ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు


