నిబంధనలు తుంగలో తొక్కి..
ఐనవోలు : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామ శివారు (మంగలి దుబ్బ)లోని సర్వేనంబర్ 1279లో సాగిన మొరం దోపిడీపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవుతున్న విషయం తెలిసిందే.. అయినప్పటికీ ఉన్నతాధికారుల వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన రెవెన్యూ డివిజనల్ అధికారి రెండు చోట్ల భారీ తవ్వకాలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి భారీఎత్తున మొరం తరలివెళ్లిన విషయాన్ని గుర్తించారు. వెంటనే మొరం తవ్వకాలు జరిగే ప్రాంతాలకు భారీ వాహనాలు రాకుండా జేసీబీతో కందకం తవ్వించారు. అసలు ఈ వ్యవస్థాగత దోపిడీకి రాచబాట వేసిన రెవెన్యూ, మైనింగ్ అధికారులపై చర్యలు గానీ, ఇప్పటికే తరలిపోయిన వేలాది టన్నుల మట్టిపై శాసీ్త్రయ విచారణగానీ చేపట్టకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి.
పొరపాటు కాదు.. పక్కా కుట్ర?
ఈవ్యవహారం బయటపడినప్పటి నుంచి రెవెన్యూ, గనుల శాఖల అధికారులు తమకేదీ తెలియనట్లుగా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటున్నారు. మైనింగ్ శాఖ వెల్లడించిన అధికారిక సమాచారం పరిశీలిస్తే దీని వెనుక పెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూభారతి పోర్టల్‌లో 22–ఏ నిషేధిత జాబితాలో 1279/2 సర్వే నంబర్ ఉండగా.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లీజు రిజిస్ట్రేషన్ జరగదని,. తెలంగాణ మైనర్ మినరల్ కన్సేషన్ రూల్స్ (టీఎస్‌ఎంఎంసీ) ప్రకారం లీజు అనేది తప్పనిసరిగా రిజిస్టర్ చేయాల్సిన పత్రం కావడంతో ఈ చట్టపరమైన అడ్డంకిని దాటవేసేందుకు రూ.20 స్టాంప్ పేపర్‌పై భూమి చదును అనే సాకుతో అక్రమ ఒప్పందం సృష్టించారనే అనుమానాలున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ చేసిన భూమిలో అసైన్డ్‌దారు కేవలం సాగు మాత్రమే చేసుకోవడానికి అర్హుడు. మిగిలిన అన్ని హక్కులు ప్రభుత్వానికి ఉంటాయన్న విషయం పర్మిట్ ఇచ్చిన అధికారులకు తెలియదనుకోవడం భ్రమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గోతులు కొలిస్తే ఏమవుతుంది?
అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతంలోకి ప్రవేశించి తనిఖీలు, కొలతలు చేపట్టే అధికారం మైనింగ్ శాఖకు ఉన్నప్పటికీ ఎందుకు భయపడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో 50 నుంచి 80 వేల మెట్రిక్ టన్నులు తరలించడానికి సుమారుగా 50 వేల క్యూబిక్ మీటర్ల మేర తవ్విన భారీ గుంతలను అధికారికంగా కొలిస్తే.. ఆ అక్రమ తవ్వకం ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కుతుంది. అప్పుడు సర్వే నంబర్ 1279లోని వివిధ భూములకు విస్తరించిన విషయం బయట పడుతుందని, అందుకే ఆ గుంతలను కొలవకుండా ఫైల్‌ను మూసేయాలనే ప్రయత్నిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొండపర్తి మొరం దందాలో కొత్తకోణం
కందకం తవ్వించి చేతులు
దులిపేసుకున్న అధికారులు
రూ.కోట్ల గ్రావెల్ లూటీకి
రూ.44 వేల చలాన్
కొలతలకు జంకుతున్న గనులు, రెవెన్యూ శాఖలు!
డీజీపీఎస్ సర్వే చేస్తే కోట్ల రూపాయల జరిమానాకు అవకాశం
సస్పెన్షన్లు తప్పవనే అధికారుల భయమా?
తహసీల్దార్ జూలై 20న ఇచ్చిన నివేదికలో భూమిని అసైన్డ్ ల్యాండ్ అని పేర్కొంటూనే, పీఓటీ చట్టానికి విరుద్ధంగా ఎన్‌ఓసీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ దరఖాస్తు చేస్తే.. అసైన్డ్ రైతే దరఖాస్తు చేసినట్లుగా తప్పుగా రాయడమే కాకుండా ఆ కాపీని కలెక్టర్‌కు పంపకుండా ఆపడానికి కారణాలేంటేని బయటపడాల్సి ఉంది. 2022లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి చెరువు మరమ్మతు కోసం ఇరిగేషన్ శాఖకు ఇచ్చిన పని ఉత్తర్వులను.. 2026 సెప్టెంబర్‌లో హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఒక వ్యక్తికి 788 మెట్రిక్ టన్నుల మొరం తరలింపు పర్మిట్ ఇవ్వడానికి మైనింగ్ శాఖ అధికారి ప్రాతిపదికగా తీసుకోవడం నిబంధనలు తుంగలో తొక్కడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ ఏడీ డిప్యూటీ డైరెక్టర్‌కు సెప్టెంబర్ 16న రాసిన సిఫార్సు లేఖలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ అని తహసీల్దార్ నివేదించినట్లు రాశారు. కానీ, ఆన్‌లైన్ ఈ పర్మిట్‌లో మాత్రం ఆ భూమిని పట్టా ల్యాండ్‌గా నమోదు చేసి పర్మిట్ జారీ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా రికార్డుల తారుమారు చేసినట్లు కాదా కొండపర్తి వాసులు ప్రశ్నిస్తున్నారు. కొండపర్తి సర్వే నంబర్ 1279లో మొత్తం 63.37 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1279/2లో 0.105 హెక్టార్ల భూమి ఉపరితలం నుంచి అరమీటర్ ఎత్తున ఉన్న మట్టిని చదును చేయడానికి 525 క్యూబిక్ మీటర్లు 788 మెట్రిక్ టన్నుల గ్రావెల్‌కు పర్మిట్ ఇచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం 1279లోని మిగతా భూముల్లో లోతైన భారీ గోతులు తవ్వి 50–80 వేల టన్నుల మొరం తరలించినట్లు తెలుస్తోంది. దీనిని తేల్చాల్సిన వారు మిన్నకుండా ఉండడంతో అక్రమాలు అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
నిబంధనలేం చెబుతున్నాయంటే..
అక్రమ క్వారీయింగ్, రవాణా జరిగితే సీనరేజ్ ఫీజుతో పాటు 5 నుంచి 10 రెట్లు అధికారులు జరిమానా విధించి వసూలు చేయాల్సి ఉంది. ఈ వ్యవహారంలో సుమారు రూ.40 లక్షలు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. పెనాల్టీ విధిస్తే మాత్రం రూ.2 కోట్లకుపైగా ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా రాష్ట్రస్థాయి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం రంగంలోకి దిగి కొండపర్తి సర్వేనంబర్ 1279లో జరిగిన తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసిన అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


