హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఐదోరోజు గురువారం శ్రీలలితా మహాత్రిపుర సుందరిగా అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకులు భద్రకాళిశేషు ఆధ్వర్యంలో వేద పండితులు చండీహోమం నిర్వహించారు. అమ్మవారి స్నపనమూర్తికి ఉదయం స్కందమాత క్రమంలో పూజలు జరిపి ఉత్సవమూర్తికి పల్లకీసేవ, సాయంత్రం దుమ్రహాక్రమంలో పూజలు జరిపి శేషవాహనంపై ఊరేగించారు. వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం ఈఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు.
దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం..
తెలంగాణ ప్రభుత్వంచే నూతనంగా ఏర్పాటు చేసిన దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సమక్షంలో ఈఓ రామల సునీత.. దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నర్సింహమూర్తి, ధర్మకర్తలతో ప్రమాణస్వీకారం చేయించారు.


