వరంగల్‌ సూపర్‌ సేవలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల షట్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌ సూపర్‌ సేవలతో ప్రైవేట్‌ ఆస్పత్రుల షట్‌డౌన్‌

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి కొత్త భవనం (24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి)లో రోగులకు అందించే సూపర్‌ సేవలతో మిగతా ప్రైవేట్‌ ఆస్పత్రులు షట్‌డౌన్‌ అవుతాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌కు సమానంగా ఇక్కడ వైద్యచికిత్స దొరుకుతుందని ఇప్పటికే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపడే విధంగా ప్రభుత్వం అన్ని వసతులు అందుబాటులో ఉంచుతుందన్నారు. మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టియానా చొంగ్తూతో కలిసి వరంగల్‌లో నిర్మాణమవుతున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన సముదాయాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మొండిగోడలతో వదిలేసిన ఈ ఎంజీఎం హాస్పిటల్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మాణం చేసిందన్నారు. దసరా పండుగ రోజున రెండు అంతస్తుల్లో ఓపీ సేవలను సాఫ్ట్‌ లాంచ్‌ చేస్తామన్నారు. నవంబర్‌ చివర, డిసెంబర్‌ 15వరకు పూర్తిస్థాయిలో జరుగు ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్నారని తెలిపారు. ‘గతంలో ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఎంజీఎం పాత ఆస్పత్రికి వెళ్లాం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలే కాకుండా ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలోని రోగులు కూడా వచ్చి చికిత్స పొందుతున్నారు. ఎంజీఎం కొత్త భవనంలోనూ హైదరాబాద్‌తో సమానంగా సూపర్‌ వైద్యసేవలు అందుతాయని, ఈ ప్రాంతంలోని గిరిజనులు, గిరిజనేతరులకు నమ్మకం కుదిరే విధంగా నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి’ అని వివరించారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు.

ఇక నుంచి నిమ్స్‌ స్థాయిలో వైద్యసేవలు..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా మంచి వైద్యం అందిస్తామని, టిమ్స్‌ కన్నా వరంగల్‌లో ఎక్కువగా వైద్యసేవలు రానున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎంలో ఓపీ మూడువేలకు పైగా ఉందని, కొత్త హాస్పిటల్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఓపీ సేవలు 4 నుంచి 5వేలకు పెరుగుతుందని చెప్పారు. దీంతో ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ పడిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో మంచి ఫ్యాకల్టీ, చికిత్స విధానం ప్రైవేట్‌ సెక్టార్‌ కన్నా అధికంగా అందుతుందని తెలిపారు. మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఓపీ సేవలు ప్రారంభంలోకి తీసుకువస్తామని, ఈ నెల 17న మరోసారి వరంగల్‌లో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించనున్నట్లు వివరించారు. ఇకనుంచి నిమ్స్‌ స్థాయిలో వైద్యసేవలను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సార య్య, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు డాక్టర్‌ సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌ పాల్గొన్నారు. అయితే వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఈ ఆసుపత్రి నిర్మాణ పనుల సమీక్షకు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ దూరంగా ఉండడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎంజీఎం పేరే ఖరారైందా...?

రూ.1,153 కోట్ల వ్యయంతో వరంగల్‌ పాత సెంట్ర ల్‌ జైలు స్థానంలో 24 అంతస్తుల నిర్మితమై వైద్య సే వలకు అందుబాటులోకి వస్తున్న ఈ వరంగల్‌ సూ పర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి ఏ పేరు పెడతారన్న చర్చ బాగా ఉండేది. ఎంజీఎం పేరునే కొనసాగిస్తారా, లే దా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అనే ఉంటుందన్నా మీమాంస ఉండేది. కాగా, మంత్రి పొంగులేటి గురువారం ఆ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఎంజీఎం భవనమే అని పలుమార్లు ఉచ్చరించడంతో ప్రభుత్వం ఆ పేరును ఖరారు చేసిందా అని అటు వైద్య వర్గాల్లో, ఇటు మీడియా వర్గాల్లో జోరుగా చర్చ సాగింది.

ఈ నెల 20న దసరా రోజున

అందుబాటులోకి ఓపీ సేవలు

నవంబర్‌ అఖరు, లేదంటే డిసెంబర్‌ 15న సీఎంతో పూర్తిస్థాయి సేవలతో ప్రారంభం

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,

సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

మంత్రి సీతక్కతో కలిసి ఆస్పత్రి తుదిదశ పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement