హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్ల నుంచి పైస్థాయి ఉద్యోగులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సీపీ శ్వేత, డీసీపీ దార కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ విఽధి నిర్వహణలో నిమగ్నమయ్యే సిబ్బందికి ఇలాంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. అనంతరం కమిషనరేట్ కార్యాలయంలోని నీటి కొలనులో బతుమ్మను నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా ఉత్తమ బతుకమ్మకు బహుమతులు ప్రదానం చేశారు.


