సూపర్‌లోకి సీకేఎం, నేత్ర వైద్యశాలలు? | - | Sakshi
Sakshi News home page

సూపర్‌లోకి సీకేఎం, నేత్ర వైద్యశాలలు?

Oct 16 2026 1:06 AM | Updated on Oct 16 2026 1:06 AM

కాశిబుగ్గ: ప్రభుత్వం వరంగల్‌లో నిర్మించిన 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ముందుగా ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించిన ఓపీ సేవలను దసరా పండుగ రోజు లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఇందులో భాగంగా గైనిక్‌ సేవలతో పాటు నేత్ర వైద్యశాల సేవలను కూడా అందించడానికి వసతి కల్పించారు. అలాగే, కేఎంసీలోని సూపర్‌ స్పెషాలిటీలోని నాలుగు విభాగాలను ఇక్కడికి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌ ప్రసూతి ఆస్పత్రి తరలిస్తారా..?

నగరంలోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా కాలం నుంచి ఉంటున్న ఈ ఆస్పత్రి మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీనిని అక్కడ ఏర్పాటు చేయడమేమిటనీ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ ఆస్పత్రిని తరలిస్తే ఊరుకునేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నా రు. ఈ ఆస్పత్రిని తరలించి, ఆ నిర్మాణాన్ని వేరే ఇతర అవసరాలకు ఉపయోగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా... దీనిపై తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఏదీ ఏమైనా అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది.

ప్రాంతీయ నేత్ర వైద్యశాల కూడా..

సీకేఎం ప్రసూతి ఆస్పత్రి మాదిరి వరంగల్‌లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాలను కూడా సూపర్‌లో విలీనం చేసే దిశగా ఆలోచన జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత భవనంలో అన్ని హంగులతో ఉన్న నేత్ర వైద్యశాలను అక్కడికి తరలిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆస్పత్రిని వేరేవాటికి ఉపయోగించి, రోగులకు అన్ని రకాల సేవలను ఒక్క చోట అందేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కూడా నేత్ర వైద్యశాల తరలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏది ఏమైనా అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.

కేఎంసీ సూపర్‌ సేవలు సైతం..

కేఎంసీ సూపర్‌ స్పెషాలిటీలోని కొన్ని సేవలను వరంగల్‌ ‘సూపర్‌’కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పిడీయాట్రిక్‌, పిడీయాట్రిక్‌ సర్జరీ, కార్డియాలజీ సేవలను మార్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే, హనుమకొండలోని ప్రసూతి ఆస్పత్రిని కూడా ఇక్కడికి మార్చాలనే ఆలోచన ఉన్నా, అక్కడ వ్యతిరేకత రావడంతో విరమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ నాలుగు ఆస్పతుల ఉన్నతాధికారులకు మాత్రం తాత్కాలికంగా కొన్ని యూనిట్ల ఓపీ సేవలను ఇక్కడ కొనసాగించాలని మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అలాగే, ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో కొనసాగుతున్న వెల్‌నెస్‌ సెంటర్‌ను కూడా తరలించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వరంగల్‌లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల

వరంగల్‌లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రి

కేఎంసీ సూపర్‌లోని నాగులు విభాగాలు సైతం..

వెల్‌నెస్‌ సెంటర్‌ తరలింపునకు నిర్ణయం

భవిష్యత్‌లో మిగతా ప్రభుత్వ ఆస్పత్రుల విలీనం తప్పదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement