వరంగల్ స్పోర్ట్స్ : ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా అవసరమైన అవకాశాలు కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండలోని జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ లెవల్ స్కూల్ గేమ్స్ లాన్ టెన్నిస్ చాంపియన్షిప్–2026ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. ఈ 17వ తేదీ వరకు జరిగే ఈ పోటీలకు ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 300 మంది క్రీడాకారులు, 100మంది టెక్నికల్ అఫిషీయల్స్ హాజరవుతారని ఎస్జీఎఫ్ఐ అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, క్రీడాప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి


