గ్రేటర్ కమిషనర్ టి.వెంకన్న
వరంగల్ అర్బన్: అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బతుకమ్మ పండుగకు సౌకర్యాలు కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు, బెస్తం చెరువు, బంధం చెరువు, పద్మాక్షిగుండం చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ నిమజ్జన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు సంజయ్ కుమార్, రవికుమార్ తదితరులు ఉన్నారు.
జనగణనలో బాధ్యతగా వ్యవహరించాలి
జనగణన–2027 రెండో దశపై చార్జ్ క్లర్కులు, టెక్నికల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ శిబిరం బుధవారం జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌హాల్‌లో ముగిసింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనాభా గణన దేశాభివద్ధి ప్రణాళికలకు కీలకమైన సమాచారాన్ని అందించే ప్రాధాన్యత కలిగిన ప్రక్రియ అని పేర్కొన్నారు. సిటీప్లానర్ రవీందర్ రాడెకర్, హైదరాబాద్ జనగణన విభాగం శిక్షకులు సతీశ్, ప్రశాంత్ సిబ్బందికి అవగాహన కల్పించారు.
రేపు జీడబ్ల్యూఎంసీలో బతుకమ్మ వేడుకలు
గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో ఈనెల 16న సాయంత్రం 5.30గంటలకు బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు కమిషనర్ టి.వెంకన్న తెలిపారు. అన్ని విభాగాల మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు, నగర మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.


