కాంగ్రెస్‌ను గద్దెదించేందుకు బతుకమ్మలతో ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను గద్దెదించేందుకు బతుకమ్మలతో ఉద్యమం

Oct 15 2026 11:47 AM | Updated on Oct 15 2026 11:47 AM

సాక్షి, మహబూబాబాద్‌ : ‘బతుకమ్మలు పట్టుకొని మహిళలు ముందు నడిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరోసారి మహిళలు బతుకమ్మలు చేతపట్టి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారు’అని బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకులు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో బుధవారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌ రెడ్డి, తుల ఉమతోపాటు, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత గోదావరి జలాలను పంట పొలాలకు మళ్లించిన కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చారని అన్నారు. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌ వస్తే కరువు వస్తుందనే నానుడి ఉందని, ఇప్పుడు అది నిజమైందన్నారు. ప్రస్తుత కరువు ప్రకృతి ద్వారా వచ్చింది కాదని, కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిందన్నారు. మళ్లీ సుఖశాంతుల తెలంగాణ రావాలంటే రావణాసురుడిలాంటి రేవంత్‌ రెడ్డి పాలన పోవాలని, రాముడి వంటి కేసీఆర్‌ పాలన రావాలన్నారు. ఇందుకోసం మహిళలను చైతన్యం చేసి బతుకమ్మలతో మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గండ్ర జ్యోతి, పావణి గౌడ్‌, హీరిక, లలిత తదితరులు పాల్గొన్నారు.

బతుకమ్మ ఉత్సవాల్లో బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement