‘సెంచరీ’ దాటిన డెంగీ | - | Sakshi
Sakshi News home page

‘సెంచరీ’ దాటిన డెంగీ

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

‘సెంచరీ’ దాటిన డెంగీ

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో సీజనల్‌ వ్యాధుల ఉధృతి కొనసాగుతోంది. డెంగీ కేసులు సెంచరీ దాటడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లావ్యాప్తంగా 121 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే 54 కేసులు వెలుగుచూడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో డెంగీ, సాధారణ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్‌తో చేరిన వారు వందల సంఖ్యలో ఉంటారని, దీన్ని క్యాష్‌గా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

సాధారణ జ్వరాలూ తక్కువేం కాదు

జిల్లాలో సాధారణ జ్వరాల కేసులు సైతం వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు మొత్తం 6,016 జ్వరాల కేసులు వచ్చాయి. సెప్టెంబర్‌లోనే 622 మంది జ్వరాలతో వైద్య సేవలు పొందారు. మరోవైపు డయేరియా కేసులు 9 నెలల్లో 3,694 నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 226 కేసులు వెలుగుచూశాయి. టైఫాయిడ్‌ కేసులు జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు 242 నమోదుకాగా.. సెప్టెంబర్‌లో ఏడు కేసులు గుర్తించారు. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండడంతో డెంగీ వ్యాప్తిపై అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

అప్రమత్తతే ఆయుధం.. వైద్యులను సంప్రదించాల్సిందే

ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పాత టైర్లు, నీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డెంగీ అనుమానం ఉన్నప్పుడు వైద్యుల సలహాతో పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్‌ బి.రాజారెడ్డి, డీఎంహెచ్‌ఓ, వరంగల్‌

డెంగీ జ్వరాలు డయేరియా టైఫాయిడ్‌

121 6,016 3,694 242

వరంగల్‌ జిల్లాలో సెప్టెంబర్‌లోనే 54 కేసుల నమోదు

జ్వరాలు, డయేరియాతోనూ ప్రజల ఉక్కిరిబిక్కిరి

అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన

యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల వారీగా కేసులు..

54 డెంగీ కేసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. కీర్తినగర్‌ యూపీహెచ్‌సీలో 9, ఎంజీఎం యూఎఫ్‌డబ్ల్యూసీలో 9, గీసుకొండ పీహెచ్‌సీ పరిధిలో ఆరు కేసులు వెలుగుచూశాయి. దేశాయిపేట, కాశిబుగ్గ, ఫోర్ట్‌ వరంగల్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఐదేసి కేసులు నమోదయ్యాయి. అలాగే, చింతల్‌ యూపీహెచ్‌సీలో 3, రంగశాయిపేట యూపీహెచ్‌సీలో ఒకటి, ఎస్‌ఆర్‌ఆర్‌ తోట యూపీహెచ్‌సీలో ఒక డెంగీ కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement