● అధికారుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్/న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభా వంతో వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా పంటల పరిస్థతి, నీటి లభ్యతను అంచనా వేయాలని, పంటలు ఎండిపోయే పరిస్థితులున్న గ్రామాలు, నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీటి వనరుల లభ్యతపై సమగ్ర సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డీఆర్డీఓ నాగ పద్మజ, పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బాలాజీ, సీపీఓ చంద్రకళ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్లో బతుకమ్మ వేడుకలు..
వరంగల్ కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం నాలుగునుంచి ఆరు గంటల వరకు బతుకమ్మ వేడుకలు, ముగ్గులపోటీ, పాటలు, అంత్యాక్షరి, స్టాండప్ కామెడీ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్ అధికారులు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది హజరై విజయవంతం చేయాలని కోరారు.


