● ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరిని కాంటినెంట్ నుంచి డాక్టర్ వరకు నిబంధనల ప్రకారం షరతులు లేకుండా క్రమబద్ధీకరించాలి.
● అన్ని కేడర్ల ఉద్యోగులకు
ఉద్యోగ భద్రత కల్పించాలి.
● పీఆర్‌సీ, న్యాయమైన వేతనాలు, వందశాతం గ్రాస్ శాలరీ అంశాలను పరిష్కరించాలి.
● 5శాతం వార్షిక ఇంక్రిమెంట్, 8 శాతం లాయల్టీ బోనస్ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలి.
● అర్హులైన మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవు మంజూరు చేయాలి.
● ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
● వివిధ కేడర్ల మధ్య వేతన, సేవా ప్రయోజనాల వ్యత్యాసాలను న్యాయబద్ధంగా సమీక్షించాలి.
● నేటినుంచి అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన
● సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదు
● 17వేల మంది ఉద్యోగుల ఐక్యపోరాటం
హన్మకొండ అర్బన్ /కాశిబుగ్గ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులంతా నేటినుంచి (మంగళవారం) నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 78 క్యాడర్లకు సంబంధించిన సుమారు 17వేల మంది ఉద్యోగులు ఏకతాటిపై వచ్చి ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఎంప్లాయీస్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పుట్ట మహేందర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండీ రుక్ముద్దీన్ వివరించారు.
గ్రామ స్థాయినుంచి పట్టణాల వరకు..
గ్రామ స్థాయినుంచి పట్టణాల వరకు ప్రభుత్వ ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో వైద్యులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మసిస్టులు, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ సిబ్బందితో పాటు వివిధ క్యాడర్ల ఉద్యోగులు సేవలందిస్తారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుండా జ్యాపం చేస్తున్నందున నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై చర్చించి రెగ్యులరైజేషన్‌తో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఎన్‌హెచ్‌ఎం క్యాడర్ ఫిక్సేషన్ చేసి వందశాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి. జీఓ 1195ను పున:పరిశీలించాలి. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరిని స్టేట్ హెల్త్ సొసైటీలో కొనసాగించి వారికి స్పర్శ ద్వారా వేతనాలు చెల్లించాలి.
– డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్,
వర్కింగ్ ప్రెసిడెంట్


