మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల పంచాయతీ పరిధిలోని శాత్రాజ్‌పల్లి గ్రామంలో సింగరేణి యాజమాన్యం, రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ పరిహారం, పునరావాస ప్యాకేజీని ఆశించి కొందరు అక్రమంగా నిర్మించిన వందలాది నిర్మాణాలను అర్ధరాత్రి కూల్చివేశారు.
9 జేసీబీలతో అర్ధరాత్రి ఆపరేషన్..
సింగరేణి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, ఫైర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ భారీ కూల్చివేతలు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి 1 గంట నుంచి ఆదివారం తెల్లవారుజామున 4 గంటల వరకు మూడు గంటలు 9 జేసీబీలతో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన 347 ఇళ్లను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కూల్చి వేసినట్లు అధికారులు తెలిపారు.
తాడిచర్ల –2 బ్లాక్ నేపథ్యంలో..
2026, జూలై 7న కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తూ ప్రకటన చేసింది. రెండో బొగ్గు గని వస్తుండడంతో భారీ పరిహారం, పునరావాస ప్యాకేజీ వస్తుందనే ఆశతో కొందరు దళారులు భూములు కొని, రాత్రికి రాత్రే రేకుల షెడ్లు, ఇళ్లు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు గురువారం (అక్టోబర్ 8) అనుమతి లేని 347 ఇళ్లకు నంబర్లు వేశారు. శనివారం అర్ధరాత్రి కూల్చివేత చేపట్టారు. జీపీ రికార్డుల ప్రకారం గ్రామంలో 85 ఇళ్లు మాత్రం రికార్డుల్లో ఉండగా ఓపెన్‌కాస్ట్–2 ఏర్పాటు నేపథ్యంలో గ్రామంలో అక్రమార్కులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మంథని, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లోని చుట్ట పక్కల గ్రామాలు చెందిన వారు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్ల విమర్శలు ఉన్నాయి. కాగా, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి ఘటనాస్థలికి చేరుకుని నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించిన అధికారులు ఆపలేదు.
భారీ పోలీస్ బందోబస్తు..
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఈ అకస్మాత్తు కూల్చివేతలతో శాత్రాజ్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిహారం ఆశించి నిర్మాణాలు చేపట్టిన వారు లబోదిబోమంటున్నారు.
శాత్రాజ్‌పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
3 గంటల్లో 347 ఇళ్లు నేలమట్టం
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ పరిహారం కోసమే అక్రమ నిర్మాణాలు


