కొనసాగిస్తారా.. కొత్త వారికిస్తారా? | - | Sakshi
Sakshi News home page

కొనసాగిస్తారా.. కొత్త వారికిస్తారా?

Oct 1 2026 9:33 AM | Updated on Oct 1 2026 9:33 AM

కొనసాగిస్తారా.. కొత్త వారికిస్తారా?

‘సూపర్‌’ డిప్యూటీ బాధ్యతలెవరికో?

కాశిబుగ్గ: కేఎంసీలోని ‘సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వహణ బాధ్యతలు ఎవరికీ కేటాయిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రత్యేకంగా డిప్యూటీ సూపరింటెండెంట్‌ను నియమించి బాధ్యతలు అప్పజెప్పేవారు. డిప్యూటీ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన డాక్టర్‌ అనిల్‌ బాలరాజు బదిలీపై వెళ్లిన తర్వాత ప్రత్యేకంగా ఎవరినీ నియమించకుండా ఖాళీగానే ఉంచారు. దీంతో ఆర్‌ఎంఓ మాత్రమే ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చూడాల్సి వచ్చింది. ఈ బాధ్యతలు తీసుకోవడానికి ప్రొఫెసర్లు ముందుకు రాకపోవడంతో రెండు నెలల క్రితం ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడ్డి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలను సీనియర్‌ ప్రొఫెసర్లు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలోని సీనియర్లతో దాదాపు నెలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌గా ఉండేలా నిర్ణయించారు. ఈనేపథ్యంలో గత ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు న్యూరాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాధవ్‌రావు ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నేటి (గురువారం)నుంచి కార్డియాలజీ ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ డాక్టర్‌ సి.మమతారెడ్డి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఆమె బాధ్యతలు తీసుకుంటారా, లేదా? అనేది గురువారం తెలుస్తుంది. కాగా, నెలకు ఒకరు చొప్పున ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అందరూ సీనియర్‌ ప్రొఫెసర్లు అయినప్పటికీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టడం వల్ల కొంతభారం పెరుగుతుంది. హాస్పిటల్‌పై నెలరోజుల్లో పట్టు సాఽధించుకునేలోపు మరో సీనియర్‌ ప్రొఫెసర్‌కు బాధ్యతలు అప్పజెప్పడం వల్ల వైద్యసేవలు ఎలా మెరుగుపడతాయో అధికారులకే తెలియాలని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. కాగా, ఈ వ్యవహారంపై గత ఆగస్టు 24న సాక్షిలో ‘సూపర్‌’లో నెలకొకరు! శీర్షికన కథనం ప్రచురితమైనా ఉన్నతాధికారుల్లో స్పందన కరువైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement