హన్మకొండ కల్చరల్: నగరానికి చెందిన పద్యకవి డాక్టర్ ఎన్వీఎన్ చారికి నబారా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ మేరకు తెలంగాణ రచయితల సంఘం, నబారా (నమిలికొండ బాలకిషన్‌రావు) వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయంలో ఆయనకు అవార్డు అందించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్వీఎన్ చారి సాహితీసేవలను గుర్తించి పురస్కారాన్ని అందజేశామన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాన్ని అందుకున్న కవి వీఆర్ విద్యార్థిని సన్మానించారు. తెరసం జిల్లా అధ్యక్షుడు పొట్లపల్లి శ్రీనివాసరావు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, సహృదయ సంస్థ అధ్యక్షుడు గన్నమరాజు గిరిజామనోహరబాబు, సొసైటీ కన్వీనర్ డాక్టర్ పాంచాల్‌రాయ్, కవులు బిల్లా మహేందర్, నాగిళ్ల రామశాస్త్రి, దాస్యం సేనాధిపతి, డాక్టర్ కర్రె సదాశివ్, రాంబ్రహ్మచారి, కొడెం సురేందర్, కార్తీకరాజు, రామ రత్నమాల తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలకసంస్థ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.
హనుమకొండ కలెక్టరేట్లో..
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గ్రీవెన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు
నయీంనగర్: సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సమాచార హక్కు చట్టంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌రావు హాజరై మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అన్నారు. చట్టాన్ని సద్విని యోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయకూడదని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా సమాచార హక్కు చట్టంలోని 4(1) బీ ప్రకారం సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని, కానీ అది సక్రమంగా అమలు కావడం లేదని తనిఖీల్లో వెల్లడైందని తెలిపారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు కమిషన్ త్వరితగతిన హియరింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 26 జిల్లాలు పర్యటించి చట్టంపై అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాది గుడిమళ్ల రవికుమార్, నేరెళ్ల శోభ, విశ్రాంత ప్రొఫెసర్ జ్యోతిరాణి, టీజీఓ హనుమకొండ అధ్యక్షుడు శ్రీనివాస్‌కుమార్, కొల్లూరు వెంకన్న, మండల పరషురాములు, రమేశ్, శ్రీనివాస్‌రావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: యువత మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ ఫర్ భారత్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ స్క్రీనింగ్ క్యాంపును కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. యువతతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.రాజారెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి అరుణ్ జోషి, జిల్లా యువజన అధికారి బి.సంజీవ్, ప్రొఫెసర్ వెంకన్న, వైద్యాధికారులున్నారు.


