సాక్షిప్రతినిధి, వరంగల్ : విద్యార్థి ఉద్యమాల చరి త్రకు సాక్షిగా నిలిచిన హనుమకొండ మరో కీలక ఘట్టానికి వేదిక కానుంది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) 90 ఏళ్ల ఉద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి వార్షికోత్సవాలకు నగరం ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ, మాజీ విద్యార్థి నాయకుల సమ్మేళనం, విద్యారంగంపై సెమినార్, రాష్ట్ర ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు తరలిరానుండడంతో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కేయూ ఆడిటోరియంలో బహిరంగ సభ..
వార్షికోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం హనుమకొండలో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించనున్నారు. పబ్లిక్ గార్డెన్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ప్రదర్శన కొనసాగనుంది. అనంతరం కేయూ ఆడిటోరియంలో బహిరంగ స భ నిర్వహిస్తారు. ఈ సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్ సిరంగి రాజన్, జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరా వు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరుకానున్నారు.
రేపు మాజీ నాయకుల సమ్మేళనం..
రెండో రోజు మంగళవారం కాజీపేటలోని బాల వికాస కేంద్రంలో ఏఐఎస్‌ఎఫ్ మాజీ ముఖ్య నాయకుల సమ్మేళనం నిర్వహించనున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తదితరులు పాల్గొననున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి వివిధ రంగాల్లో స్థిరపడిన మాజీ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నారు. విద్యార్థి దశలో ఉద్యమాల్లో పాల్గొని అనంతరం రాజకీయాలు, న్యాయ, వైద్య, సాంకేతిక తదితర రంగాల్లో రాణిస్తున్న పూర్వ నాయకులు ఒకే వేదికపైకి రానుండడం ఈ సమ్మేళనానికి ప్రత్యేకతగా నిలవనుంది.
విద్యారంగ సవాళ్లపై చర్చ..
విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక సె మినార్ నిర్వహించనున్నారు. ప్రముఖ విశ్లేషకులు మల్లేపల్లి లక్ష్మయ్య, కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రి టైర్డ్ ప్రొఫెసర్ మార్క శంకర్ నారాయణ తదితరులు పాల్గొంటారు. ప్రస్తుత విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న స వా ళ్లు, విద్యారంగంలో చేపట్టాల్సిన మార్పులపై చ ర్చించనున్నారు. వేడుకల్లో చివరి రోజైన బుధవా రం కాజీపేట బాలవికాస కేంద్రంలో రాష్ట్ర ప్రతిని ధుల సభ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులు విద్యారంగ సమస్యలపై చర్చించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తరలివస్తున్న ప్రతినిధులు..
ఏఐఎస్‌ఎఫ్ 90వ వార్షికోత్సవాల నిర్వహణ కోసం రాష్ట్ర, జిల్లా నాయకులు కొన్ని రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రహమాన్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి నాయకులు, ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో 28, 29,30 తేదీల్లో మూడు రోజులపాటు హనుమకొండలో విద్యార్థి ఉద్యమ సందడి నెలకొననుంది.
స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి పోరాట ప్రస్థానం
అఖిల భారత విద్యార్థి సమాఖ్య 1936లో ఏర్పాటై దేశ విద్యార్థి ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి విద్యార్థుల హక్కులు, విద్యారంగ సమస్యలపై ఉద్యమాలు చేపట్టిన సంస్థగా గుర్తింపు పొందింది. తొమ్మిది దశాబ్దాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలు విద్యార్థి ఉద్యమ గతాన్ని గుర్తుచేసుకోవడంతోపాటు, ప్రస్తుత విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు వేదిక కానున్నాయి.
9 దశాబ్దాల పోరాటం.. నేటినుంచి మూడు రోజుల పండుగ
పబ్లిక్ గార్డెన్ నుంచి కేయూ వరకు భారీ విద్యార్థి ప్రదర్శన
ప్రారంభ సభకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ, రాష్ట్ర నాయకులు


