న్యూశాయంపేట : రాష్ట్రంలో మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతి కోసం ఐక్యపోరాటాలే శరణ్యమని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ వాహబ్ అన్నారు. ఆదివారం హనుమకొండ ములుగు రోడ్డులోని ముస్లిం కమ్యూనిటీ సెంటర్‌లో హక్కుల పోరాట సమితి హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు మహ్మద్ మోహిబుద్దీన్, మహ్మద్ హామీద్ షరీఫ్‌ల అధ్యక్షతన ‘మైనార్టీల ప్రధాన సమస్యలు–పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పూర్తి స్థాయిలో విడుదల చేసి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా మహ్మద్ అబ్దుల్ ఖలీఖ్ తన్వీర్, గ్రేటర్ వరంగల్ సిటీ అధ్యక్షుడిగా మహ్మద్ ఖాదర్‌వలీతో పాటు మరో 21మంది కోచైర్మన్లతో కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ మసూద్, డాక్టర్ రాజ్‌మహ్మద్, సిరాజ్ అహ్మద్, తాజుద్దీన్, నయీముద్దీన్, మహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్
వరంగల్ ఉమ్మడి జిల్లా
జేఏసీ ఎన్నిక


