కాశిబుగ్గ: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హైదరాబాద్‌లో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి జిల్లాలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు సమాచారం. అలాగే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం.
వరంగల్ స్పోర్ట్స్: నగరంలోని కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన 41 మందికి బుధవారం సెట్విన్ అధికారులు పరీక్ష నిర్వహించారు. దీనికి హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, ట్రైనింగ్ సెంటర్ ఇన్‌చార్జ్ అఖిల్, స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. సెట్విన్ సంస్థ ప్రతినిధులు, పర్యవేక్షకులు బేగం, సుష్మ పర్యవేక్షించారు. ఈసందర్భంగా డీవైఎస్‌ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. కొత్తగా మొదలవుతున్న బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ గార్మెంట్ మేకింగ్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీ కోర్సులో శిక్షణకు అడ్మిషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 79955 03018 నంబర్‌లో సంప్రదింవచ్చని సూచించారు.
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో కొనసాగుతున్న అమృత్ భారత్ నిర్మాణ పనులను బుధవారం సికింద్రాబాద్ రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేశర్‌వాణి తనిఖీ చేశారు. కాజీపేట అమృత్ భారత్ పనులు, స్టేషన్ ఎదుట ఉన్న సర్క్యులేటింగ్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేసి అభివృద్ధి పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానిక అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలిచ్చారు. ఈతనిఖీలో కాజీపేట ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, స్థానిక రైల్వే సూపర్‌వైజర్లు, వర్క్ సూపర్‌వైజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆర్టీసీ తాత్కాలిక బస్టాప్ ఏర్పాటు
కాజీపేట రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్టేషన్ ముందున్న ఆర్టీసీ లోకల్ బస్టాప్‌ను రైల్వే అధికారులు కాజీపేట రైల్వే స్టేడియానికి బుధవారం తరలించారు. పనులు పూర్తయ్యేవరకు ఇక్కడి నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని హనుమకొండ లోకల్ బస్ ఆర్టీసీ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లల (విద్యార్థులు)కు ఈనెల 11న ప్రత్యేక వైద్య/సహాయక పరికరాల గుర్తింపు కోసం శిబిరం నిర్వహించనున్నట్లు డీఈఓ గిరిరాజ్‌గౌడ్, కమ్యూనిటీ మొబి లైజింగ్ కో–ఆర్డినేటర్ సుమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరాన్ని హసన్‌పర్తిలోని జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకుకు అవసరమైన సహాయ పరికరాలు వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర కృత్రిమ పరికరాలు అందించేందుకు క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఎంలు, ఐఈఆర్పీలు ఆయా పిల్లలను గుర్తించి క్యాంపులకు హాజరయ్యేలా చూడాలని కోరారు.
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో భూగర్భ డ్రెయినేజీ (యూజీడీ) పనులకు కసరత్తులు వేగవంతమయ్యాయి. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు కోసం అవసరమైన మేరకు ప్రభుత్వ భూములను సేకరించేందుకు జీఓ ఉత్తర్వులు జారీ చేసింది. అందుకోసం 8 ప్రాంతాలను ఎంపిక చేశారు. సీవరేజ్ పంపింగ్ సిస్టమ్ (ఎస్‌పీఎస్), సెప్టిక్ ట్యాంక్స్, వెట్ వాల్స్, నిర్మాణానికి సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏఐ) ద్వారా తీసుకోవాలని సూచనలు చేసింది.


