హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, విద్య, గృహ నిర్మాణం తదితర రంగాలకు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ విష్ణుప్రియ, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీఆర్డీఓ మేన శ్రీను, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, మెప్మా పీడీ రాజేశ్వర్, ఆర్బీఐ రీజినల్ లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యశ్వంత్‌సాయి, యూబీఐ రీజినల్ హెడ్ కమలాకర్, ఆర్సెటీ డైరెక్టర్ రవి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోషకాహార లోప నివారణకు కృషి
పోషకాహార లోపం, రక్తహీనత నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. జాతీయ పోషణ మాసం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించనున్న పోషణ మాసం ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోషణ మాసం ప్రతిజ్ఞ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి విశ్వజ, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీఈఓ గిరిరాజ్‌గౌడ్, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, డీవైఎస్‌ఓ ప్రశాంత్, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులున్నారు.


