కాళోజీ స్ఫూర్తితో ప్రశ్నించాలి | - | Sakshi
Sakshi News home page

కాళోజీ స్ఫూర్తితో ప్రశ్నించాలి

Sep 10 2026 3:38 AM | Updated on Sep 10 2026 3:38 AM

కాళోజీ స్ఫూర్తితో ప్రశ్నించాలి

హన్మకొండ: ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో అన్యాయాన్ని ప్రశ్నించాలని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలోని ఆయన విగ్రహానికి ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్‌రావు, కాళోజీ ఫౌండేషన్‌ ప్రతినిధులు, కవులు, రచయితలు కళాకారులు, ఆయా పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ కాళోజీ కవిత్వం, రచనలు ప్రజలు తమపై జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రశ్నించే ధైర్యాన్ని కల్పించాయన్నారు. నేటితరం కాళోజీ రచనలను చదివి, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాళోజీ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం అందించే స్మారక పురస్కారం ఆయన సాహిత్య, సామాజిక సేవలకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు.

సభా గౌరవాన్ని మంటగలపొద్దు

శాసనసభలో స్పీకర్‌ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అనుచిత, అసభ్య పదజాలం ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చడమేనని ఎంపీ కావ్య అన్నారు. స్పీకర్‌ ఏ కులం, ఏ మతానికి చెందిన వ్యక్తి అన్నది కాకుండా.. ఆ కుర్చీని, రాజ్యాంగబద్ధమైన పదవిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతీ ప్రజాప్రతినిధిపై ఉందన్నారు. మహిళా పోలీసుల సమక్షంలో కేటీఆర్‌, హరీశ్‌రావు చొక్కాలు విప్పడం, ఆందోళన సమయంలో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. ఈ ఘటనపై తాను జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌, తెలంగాణ శాసనసభ సెక్రటేరియట్‌, సంబంధిత అధికార యంత్రాంగం కూడా ఘటనను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరానన్నారు.

వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య

కాళోజీ విగ్రహానికి నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement