ధర్మసాగర్ : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారంలో గ్రామ పంచాయతీ భవనం, రామాలయ నిర్మాణానికి ఓ కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. అదే గ్రామానికి చెందిన చింతలపాని సుధీర్‌రెడ్డి, చింతలపాని సుకన్య ఇరువురు తమకు చెందిన రూ.50లక్షల విలువైన 550 గజాల ఓపెన్ ప్లాటును గ్రామ పంచాయతీకి దానం చేశారు. ఈ మేరకు ఆదివారం నోటరీ పత్రాలను సర్పంచ్ రేణుకవెంకట్, మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌కు వారు అప్పగించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ.. తమ తండ్రి చింతలపాని రామచంద్రా రెడ్డికి గ్రామంలో ఉన్న ఆస్తిలో నలుగురు కుమారులకు నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయని తెలిపారు. అందులో తమ ఇద్దరి వాటాగా వచ్చిన స్థలాన్ని తండ్రి జ్ఞాపకార్ధం గ్రామాభివృద్ధికి కేటాయించినట్లు చెప్పారు. తండ్రి పేరు మీద ఊరికి ఈ చిన్న సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించకుండా ప్రజా ప్రయోజనాల కోసం కోట్ల విలువైన భూమిని దానంగా ఇవ్వడంపై ముప్పారం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. మన ఊరి అభివృద్ధి–మన బాధ్యత అనే స్ఫూర్తితో ముందుకు వచ్చిన దాతలను సర్పంచ్ రేణుక, ఉప సర్పంచ్ కుమారస్వామి, గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ భవనాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామంలోని మరికొందరు దాతలు కూడా ముందుకు రావాలని సర్పంచ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
చింతలపాని సోదరుల ఉదారత


