సాక్షి ప్రతినిధి, వరంగల్:
కాంగ్రెస్ పార్టీ ఓరుగల్లు రాజకీయాల్లో ఆట మొదలైంది. ఒకవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై చర్చ.. మరోవైపు వరంగల్ తూర్పులో అంతర్గత సమీకరణాలపై ఆసక్తి.. వెరసి ‘కొండా’ దంపతులకు ‘అక్కడ సెగ.. ఇక్కడ పొగ..’ అన్నట్టుగా పరిస్థితి మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారానికి ఆమె స్వయంగా తెరదించారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. దీంతో తక్షణ రాజకీయ సంక్షోభంపై కొంత స్పష్టత వచ్చింది. వరంగల్ తూర్పుపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ‘కుడా’ చైర్మన్ గుండు సుధారాణి పట్టు బిగిస్తుండడం.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తూర్పులో కొండా కుటుంబానికి భిన్నంగా వేగమందుకున్న కాంగ్రెస్ నేతల కదలికలపై చర్చ మొదలైంది.
కాంగ్రెస్‌లోనే.. సురేఖ స్పష్టత
పార్టీ మారతారనే ప్రచారం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే చర్చ మధ్య సురేఖ తన వైఖరిని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో వెంటనే పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా వంటి అంశాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్‌లోనే తన రాజకీయ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో.. పార్టీలో తన ప్రాధాన్యాన్ని ఎలా కొనసాగిస్తారు? తన వర్గాన్ని ఎలా సమన్వ యం చేసుకుంటారు? అన్నది కీలకంగా మారింది.
పెరుగుతున్న వ్యతిరేక స్వరం..
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొండా సురేఖకు భిన్నమైన రాజకీయ వర్గాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ మేయర్ గుండు సుధారాణి వంటి నేతలు వరంగల్ తూర్పు రాజకీయాల్లో తమదైన ప్రాధాన్యం కలిగిన నాయకులు. గత రాజకీయ పరిణామాల్లో కొండా కుటుంబంతో వీరికి భిన్నాభిప్రాయాలు కనిపించిన సందర్భాలున్నాయి. తాజాగా శుక్రవా రం మీడియాతో మాట్లాడిన గుండు సుధారాణి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ పోటీ చేయాలని, తాను సైతం ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని బస్వరాజు సారయ్య.. సురేఖకు సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో వీరి రాజకీయ వైఖరి ఎలా ఉంటుంది? కొండా సురేఖతో పార్టీ అంతర్గతంగా సమన్వయం జరుగుతుందా? లేక కాంగ్రెస్‌లో వేర్వేరు రాజకీయ శక్తులుగా కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయబోనని స్పష్టత
‘తూర్పు’ రాజకీయాల్లో
వేగంగా పెరిగిన పరిణామాలు
కొండా దంపతుల
భవిష్యత్ వ్యూహం ఏంటి?


