ప్రజల కన్నీళ్లపై కాంగ్రెస్ సంబరాలా?
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హన్మకొండ: సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న, వారి ఇళ్లను కూల్చేస్తున్నందుకు, ఎన్నికల హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ధర్నా, వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. సహపంక్తి భోజనం చేశారు. ఈసందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యిందని సంబరాలు చేసుకునే ముందు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్, పోలెపల్లి రా మ్మూర్తి, నయీముద్దీన్, రంగారెడ్డి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.
వరంగల్ పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో..
వరంగల్ చౌరస్తా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. శు క్రవారం వరంగల్ పోచమ్మమైదాన్ జంక్షన్‌లో వంటావార్పు, నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.


