హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణజన్మాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో గోకులాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ‘కుడా’ మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, ఒగ్గుడోలు నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముందుగా నగరానికి చెందిన గొల్లకురుమలు హనుమకొండ గోకుల్‌నగర్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు శ్రీకృష్ణ విగ్రహంతో ర్యాలీగా వచ్చి కళాక్షేత్రం వేదికపై శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, మార్తినేని ధర్మారావు, బీజేపీ నాయకురాలు రావు పద్మ యాదవసంఘం నాయకులు పాల్గొన్నారు.


