హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్ : ప్రత్యామ్నాయ పంటల సాగులో భాగంగా పప్పు దినుసులను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మనిర్భరత ఇన్‌పల్సెస్’ కార్యక్రమంపై మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు పరిస్థితులు, రైతుబీమా క్లెయిమ్‌ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల నాణ్యతా ప్రమాణాలపై ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. రైతుబీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీలో ఇప్పటివరకు 87.8 శాతం నమోదు పూర్తయ్యిందని, మిగిలిన రైతుల నమోదును త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్‌చంద్ర, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, అవినాష్‌వర్మ, సాంకేతిక వ్యవసాయ అధికారి కమలాకర్, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.


