కాశిబుగ్గ: వరంగల్ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్ జాటోతు వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ వెంకటేశ్వర్లును ఫారెన్ సర్వీసు కింద డిప్యూటేషన్‌పై రిజిస్ట్రార్‌గా మూడేళ్లపాటు పనిచేయడానికి ప్రభుత్వం ఇటీవల నియమించింది. కాళోజీ హెల్త్‌వర్సిటీలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన డాక్టర్ నాగార్జున రెడ్డి జాయింట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించనున్నారు. కాగా, డాక్టర్ వెంకటేశ్వర్లును కాశోజీ వీసీ డాక్టర్ రమేష్‌రెడ్డి, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ నాగార్జునరెడ్డి సన్మానించారు.
హన్మకొండ కల్చరల్: ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మాసం శ్రావణం అని, ఆలయాల్లో పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని దేవాదాయశాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ రామల సునీత అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం ఉదయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు గణపతి ఆరాధన, శ్రీరుద్రేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. డీసీ రామల సునీత స్వామివారికి పూజలు చేశారు. ఈ నెల 13 నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రాన్ని రామల సునీత ఆవిష్కరించి మాట్లాడారు. ఈఓ అనిల్‌కుమార్, ఆలయ వేదపండితుడు గంగు మణికంఠశర్మ, మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు.
వరంగల్ లీగల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు.
విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు టి.లింగారెడ్డి, నన్నబోయిన తిరుపతి తెలిపారు. హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హనుమకొండ, వరంగల్ జిల్లాల యూఎస్సీఎస్ శాఖల దశలవారీ పోరాటాల సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీల్లో అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద, 19న జిల్లాకేంద్రంలో ధర్నాలు, 29న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పీఆర్‌సీని 2023నుంచి అమలు చేయాలని, సీపీస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్లతో ఆందోళలు చేపడతామని పేర్కొన్నారు. కమిటీ రాష్ట్ర బాధ్యులు రావుల రమేష్, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లాల బాధ్యులు పెండెం రాజు, గొడిశాల సత్యనారాయణ, జి. ఉప్పలయ్య, కె.శ్రీనివాస్, బైరి స్వామి, భీమళ్ల సారయ్య, శ్రీనివాస్, డి.శ్రీరామ్, సూరయ్య, ఎ.మల్లయ్య, ఆర్.రాంరెడ్డి పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో హిందీ, పీఈటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ గిరిరాజ్‌గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటలవరకు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. హిందీ పోస్టుకు హిందీ సబ్జెక్టుతోపాటు బీఏ లేదా బీఓఎల్ హిందీ ప్రవీణ/విధ్వాన్ లేదా ఎంఏ హిందీతోపాటు బీఈడీ లేదా ప్రచారక్ లేదా శిక్షణా కళా ప్రవీణ డిప్లొమా లేదా హిందీపండిట్ కలిగి ఉండాలన్నారు. పీఈటీకి ఇంటర్ లేదా బీఏతోపాటు బీపీఈడీ అర్హతగా పేర్కొన్నారు.


