మూడు నెలల ప‘రేషన్‌’! | - | Sakshi
Sakshi News home page

మూడు నెలల ప‘రేషన్‌’!

Aug 12 2026 7:54 AM | Updated on Aug 12 2026 7:54 AM

మూడు నెలల ప‘రేషన్‌’!

బియ్యం సరఫరా చేయాలి

హన్మకొండ అర్బన్‌ : మూడు నెలల రేషన్‌బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు తగిన ఏర్పాట్లు లేక కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే పంపిణీ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక రేషన్‌ దుకాణాలకు స్టాక్‌ చేరలేదు. దీంతో బియ్యం పంపిణీ ఎప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ముందుగా స్టాక్‌ చేరిన దుకాణాల్లోనూ రెండు రోజుల్లోనే బియ్యం ఖాళీ కావడంతో కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ జిల్లాలో మొత్తం 414 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటికి హనుమకొండ, పరకాలలోని రెండు ఎంఎల్‌ఎస్‌ (మండల స్థాయి నిల్వ) పాయింట్ల నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయి. హనుమకొండ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో 264 దుకాణాలు ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అన్ని షాపులకు బియ్యం సరఫరా కాలేదు.

వచ్చిన స్టాక్‌ రెండు రోజుల్లోనే ఖాళీ..

ముందుగా బియ్యం చేరిన దుకాణాలకు కార్డుదారులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో రెండు రోజుల్లోనే స్టాక్‌ ఖాళీ అయిపోయింది. మళ్లీ బియ్యం వచ్చేవరకు రావద్దని డీలర్లు చెబుతున్నా.. సరైన సమాచారం లేక కార్డుదారులు ఉదయంనుంచే షాపుల వద్దకు చేరుకుంటున్నారు. కొన్నిచోట్ల ఉదయం 6 గంటల నుంచే క్యూలు మొదలవుతుండగా.. రాత్రి 9 గంటల వరకు డీలర్లు దుకాణాలు తెరిచి ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. బియ్యం కోసం కొన్ని చోట్ల డీలర్లు, కార్డుదారుల మధ్య వాగ్వాదాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా బియ్యం ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రధాన కారణాలు..

ఎస్‌డబ్ల్యూఎస్‌, ఎఫ్‌సీఐ గోదాముల నుంచి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలించడం స్టేజ్‌–1 కాంట్రాక్టర్‌ బాధ్యత కాగా.. అక్కడి నుంచి దుకాణాలకు చేర్చడం స్టేజ్‌–2 కాంట్రాక్టర్‌ బాధ్యత. ఈ రెండు దశల రవాణా బాధ్యతలు ఒకే కాంట్రాక్టర్‌ పరిధిలో ఉండటంతో తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయకపోవడం.

● బియ్యం రవాణా, పంపిణీ ప్రారంభమైన సమయంలో హమాలీల అదనపు డబ్బుల డిమాండ్‌ కూడా మరో కారణమని చెబుతున్నారు.

● దుకాణాల వారీగా స్టాక్‌ ఎప్పుడు చేరుతుంది..

ఎప్పుడు పంపిణీ చేస్తారనే సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయకపోవడం.

ఒకటో తేదీ నుంచే పంపిణీ.. ఇప్పటికీ సగం షాపులకు చేరని బియ్యం

స్టాక్‌ వచ్చిన చోట రెండు రోజుల్లోనే ఖాళీ

ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దుకాణాల వద్ద పడిగాపులు

అదనపు కలెక్టర్‌కు రేషన్‌డీలర్ల వినతి

హన్మకొండ అర్బన్‌ : రేషన్‌దుకాణాలకు వెంటనే పూర్తిస్థాయిలో బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పరకాల, హనుమకొండ గోదాములనుంచి షాపులకు ఇప్పటివరకు 30శాతం బియ్యం మాత్రమే సరఫరా చేశారని, మరో 70శాతం రావాల్సి ఉందని డీలర్లు తెలిపారు. దీంతో లబ్ధిదారులకు పంపిణీలో జాప్యం జరుగుతోందని, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేడ్కర్‌ గోదాం శిథిలావస్థకు చేరినందున దాన్ని వెంటనే సురక్షిత ప్రాంతానికి మార్చి, అక్కడ బియ్యం నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి చలిగాని మోహన్‌, ప్రతినిధులు మహేశ్వరం గౌరీ శంకర్‌, పోతరాజు రమేష్‌, శ్రీశైలం ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement